ఆరోగ్యశ్రీకి పడకలివ్వకుంటే అనుమతులు రద్దు

22 May, 2021 04:48 IST|Sakshi

తనిఖీలకు ఆరోగ్యశాఖ నిర్ణయం

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా ఆరోగ్యశ్రీలో కోవిడ్‌కు 50 శాతం పడకలు ఇవ్వకపోతే ఆ ఆస్పత్రులకు కోవిడ్‌ అనుమతులతోపాటు అవసరమైతే రిజిస్ట్రేషన్‌ రద్దుచేస్తామని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఉదాహరణకు కృష్ణాజిల్లాలో పేరున్న ఓ ఆస్పత్రికి మచిలీపట్నం బ్రాంచ్‌లో 130 పడకలుండగా, 5 పడకలు మాత్రమే ఆరోగ్యశ్రీకి ఇచ్చారు. అదే ఆస్పత్రికి విజయవాడ భవానీపురంలో 150 పడకలుంటే 10 పడకలు కూడా చూపించలేదు. ఇలాంటి ఆస్పత్రులు విశాఖపట్నం, కృష్ణాజిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు ఆరోగ్యశాఖకు సమాచారం వచ్చింది.

దీంతో రానున్న రెండు రోజుల్లో అన్ని ఆస్పత్రుల్లోను తనిఖీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్‌ చికిత్స చేసే ఏ ఆస్పత్రిలో అయినా సరే 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాలని, కోవిడ్‌ సమయంలో అన్ని ఆస్పత్రులు ఇది పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ కొన్ని ఆస్పత్రులు ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో వాటిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినా భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇప్పటికే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోనే చర్యలు
ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అలాంటి ఆస్పత్రిపై 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటాం. కోవిడ్‌ చికిత్సకు 50 శాతం పడకలు ఇవ్వని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ రద్దుచేసేందుకైనా వెనుకాడేది లేదు.
– డాక్టర్‌ ఎ.మల్లికార్జున,సీఈవో, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌  

మరిన్ని వార్తలు