పవిత్ర గోదావరి తీరాన పచ్చి అబద్ధాలా?

8 Jun, 2022 05:55 IST|Sakshi

బీజేపీ అధ్యక్షుడు నడ్డాపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం 

ఇంటికో ఉద్యోగమన్నారు.. ఎన్ని ఇచ్చారు? 

ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీ గుర్తుందా? 

పోలవరానికి నిధులివ్వకుండా కాల్చుకు తింటున్నారు 

పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధానే అన్నారు 

అలాంటి చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకున్నారు?  

సాక్షి, అమరావతి: కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ఏం మేలు చేసిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నిలదీశారు. ‘పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరంలో బరితెగించి అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడానికే ఢిల్లీ నుంచి వచ్చారా?’ అని ప్రశ్నించారు. ‘మీలాంటి వారిని చూసే రాజకీయ నాయకులకు సిగ్గు లేదని ప్రజలు అనుకుంటున్నారు’ అంటూ ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని   మాట్లాడారు. నాని చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

అప్పులు చేస్తుంటే మీరేం చేస్తున్నారు?
ఏపీ ప్రభుత్వం శృతి మిం చి అప్పులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది? మీది చేతగాని ప్రభుత్వమా? ప్రధాని, కేంద్ర ఆర్థిక మం త్రి అనుమతి లేకుండా అప్పులు తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో రూ.80 లక్షల కోట్ల అప్పు చేసి దేశానికి ఏం సాధించి పెట్టింది? కులం, మతం పేరుతో తగువులు పెట్టడం, మసీదులు పడగొట్టి గుళ్లు కట్టడం తప్ప.

మీ హామీలేమయ్యాయి?
ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? జన్‌ ధన్‌ ఖా తాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారు. ఒక్కరి ఖాతాలోనైనా జమ చేశారా? రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా హామీ ఏమైంది? విభజన చట్టం 13వ షెడ్యూలులో అంశాలు అమలు చేశారా? ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్‌ వర్శిటీ, పెట్రోలియం వర్శిటీ, దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్‌ జిల్లాకు స్టీల్‌ ప్లాంట్,  గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రో రిఫైనరీ, విశాఖ, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు, విశాఖ మెట్రో రైలు, వీజీటీఎంకు మెట్రో రైలు హామీలు ఏమయ్యాయి.

గుజరాత్‌ దగ్గర సముద్రంలో పడేశారా? మూడేళ్లుగా రాష్ట్రంలో మత చిచ్చు రేపడానికి కుట్ర చేస్తున్నది బీజేపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శాంతిభద్రతల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని నడ్డా అనడం విచిత్రం.

పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? నిర్వాసితుల పునరావాసానికి నిధులిస్తామన్నారా? రాష్ట్రం ఖర్చు చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకుండా జీవనాడి పోలవరాన్ని కాల్చుకు తింటున్నది బీజేపీ ప్రభుత్వం కాదా? దేశంలో ఈడీ, ఐటీ, సీబీఐలతో విపక్షాల గొంతు నొక్కుతున్నది బీజేపీ కాదా? ఎంత మంది ప్రతిపక్ష నేతలను జైళ్లకు పం పారో ప్రజలకు తెలియదా? 

సీఎం వైఎస్‌ జగన్‌ పథాకాలన్నీ కేంద్రానివా?
రాష్ట్రంలో సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివేనని నడ్డా చెప్పడం ఆశ్చర్యం. రాష్ట్రంలో ఇళ్లు లేని 31 లక్షల మంది పేదల సొంతింటి కల సాకారానికి రూ.10 వేల కోట్లతో ఇంటి స్థలాలు ఇచ్చారు జగన్‌. అందులో కేంద్రం వాటా ఒక్క రూపాౖయెనా ఉందా? అమ్మ ఒడి, నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల ఆధునికీకరణకు కేంద్రం రూపాౖయెనా ఇస్తోందా? రాష్ట్రంలో కోవిడ్‌ బారిన పడిన ప్రజల వైద్యం కోసం రూ.30 వేల కోట్లను సీఎం జగన్‌ ఖర్చు చేశారు. కేంద్రం ఒక్క రూపాయీ ఇవ్వలేదు. పీఎం కిసాన్‌ పథకం కింద 40 లక్షల మందికి కేంద్రం సహాయం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం 53 లక్షల మందికి ఇస్తోంది.

అధికారం కోసం ఎంతకైనా బరితెగిస్తారా?
రాష్ట్రంలో టీడీపీ–బీజేపీ–జనసేన ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారని మళ్లీ రాష్ట్రంలో ఓట్లు అడగడానికి నడ్డా వచ్చారు? ఆ అర్హత బీజేపీకి లేదు.

2019 ఎన్నికల్లో పోలవరాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకున్నారు? అవినీతి, అక్రమాల కోసం రాజధాని అమరావతిని చంద్రబాబు కేంద్రంగా మార్చుకున్నారని బీజేపీ ఆరోపించింది. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు? 

ఆరోగ్యశ్రీకి కేంద్రం ఇచ్చేదింతే
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్‌లను కాపీ కొట్టి గుజరాత్‌లో పెట్టిన చరిత్ర బీజేపీది. వైఎస్‌ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకా న్ని సీఎం వైఎస్‌ జగన్‌ కొనసాగిస్తున్నారు. ఆరోగ్య శ్రీ కింద ఏడాదికి రూ.2,400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అందులో కేంద్రం ఇ చ్చేది రూ.230 కోట్లే. విశ్రాంతి సమయంలో రోగులకు వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం కింద ఏడాదికి రూ.360 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

రాష్ట్రం లో ఆరోగ్యశ్రీ కింద 1.47 కోట్ల కుటుంబాలకు వైద్య సహాయం అందిస్తుంటే.. కేంద్రం పలు నిబందనలతో 55 లక్షల కుటుంబాలకే ఆయుష్మాన్‌ భారత్‌ను వర్తింపజేస్తోంది. 55 లక్షల కుటుంబాలకే బియ్యం రాయితీ ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 1.47 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ.77 వేల కోట్లు ఇచ్చిందనడం మరో విడ్డూరం. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి హక్కుగా దక్కిన నిధులనే కేంద్రం ఇచ్చింది. 

మరిన్ని వార్తలు