లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై.. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ

29 Jul, 2020 19:08 IST|Sakshi

సాక్షి, కృష్ణా: కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి 9 వరకు మచిలీపట్నంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 'మచిలీపట్నంలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అభిప్రాయం సేకరించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసరాలకు అనుమతిస్తున్నాం. మిగిలిన వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా మూసివేయబడతాయి. బస్సులు, ఆటోలు, మోపెడ్‌లు రోడ్లపై తిరగ రాదు. అందరూ కూడా లాక్‌డౌన్‌కు సహకరించాలి.

వారం రోజులపాటు మచిలీపట్నంలోకి రావడానికి గాని, మచిలీపట్నం నుంచి బయటకు వెళ్లడం గాని చేయకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు, వ్యవసాయ కూలీలు సంబంధిత సచివాలయంలో నమోదు చేసుకుని వ్యవసాయ పనులకు వెళ్లాలి. కరోనా నిర్దారణ పరీక్షల్లో సగటున 45% పాజిటివ్‌లు రావడం చాలా విచారకరం. మచిలీపట్నంలో బక్రీద్ నాడు ముస్లిం సోదరులు ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలని, ముఖ్యంగా 60 సంవత్సరాల వయసున్నవారు, చిన్నపిల్లలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం' అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.  (చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగిన ఒమ‌ర్ అబ్దుల్లా)

మరిన్ని వార్తలు