పాత్రికేయులకు త్వరలో అక్రిడిటేషన్లు

26 Jun, 2021 04:19 IST|Sakshi

కొత్తవారు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం 

మంత్రి పేర్ని నాని వెల్లడి

సాక్షి, అమరావతి: అక్రిడిటేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సరైందేనని న్యాయస్థానం తీర్పునివ్వడం పట్ల సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సంతోషం వ్యక్తం చేశారు. ఆ జీవోలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారమే పాత్రికేయులకు సోమవారం నుంచి అక్రిడిటేషన్లు జారీ చేస్తామన్నారు. విజయవాడలోని ఆర్టీసీ బస్‌ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 20,610 మందికి అక్రిడిటేషన్లున్నాయని, తమ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ఆహ్వానించగా ఏకంగా 40,442 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని తెలిపారు.

జీవోలోని మార్గదర్శకాలను అనుసరించి వారిలో 32,314 మంది దరఖాస్తులు చేశారని చెప్పారు. వాటిలో ఇప్పటి వరకు 17,139 దరఖాస్తులను పరిశీలించి 6,490 మందికి అవసరమైన పత్రాలు సమర్పించాలని తెలిపామన్నారు. కేవలం 90 మంది దరఖాస్తులనే తిరస్కరించినట్టు చెప్పారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చేనాటికి 874 మంది దరఖాస్తులను ఆమోదించగా వారిలో 464 మందికి అక్రిడిటేషన్లు జారీ చేసినట్టు తెలిపారు. కొత్త వారు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు, దరఖాస్తు చేసుకున్నవారు వాటిలో మార్పులకు   కూడా అవకాశం కల్పిస్తామన్నారు. అక్రిడిటేషన్ల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని  చెప్పారు. అక్రిడిటేషన్ల జారీ తర్వాత అర్హులైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారని తెలిపారు.

ప్రతిభ చాటుకుంటేనే అవకాశాలు.. 
విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాల్సి ఉన్నందునే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘చంద్రబాబు కొడుకు లోకేశ్‌కు  సత్యం రామలింగరాజు వంటివారు అమెరికాలో సీటు ఇప్పించి చదివిస్తారు గానీ, సామాన్యుల పిల్లలు పరీక్షలు రాసి ప్రతిభ చాటుకుంటేనే కదా అవకాశాలు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కొందరు టీఆర్‌ఎస్‌ మంత్రులు వైఎస్సార్‌పై విమర్శలు చేస్తూ భావోద్వేగాలు రేకెత్తించేందుకు యత్నిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఒక్క గ్లాసు నీటిని కూడా అదనంగా వాడుకోవడం లేదన్నారు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు