ప్రాణం ఖరీదు రూ.లక్ష!.. సూది మందు వికటించి వ్యక్తి మృతి

17 Jan, 2023 07:47 IST|Sakshi

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులు తీస్తున్న నేటి రోజుల్లో రాతియుగం నాటి అనాగరిక సంస్కృతికి తెరలేపారు కొందరు. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందితే... రూ.లక్ష పరిహారం చెల్లించేలా దుప్పటి పంచాయితీ చేశారు. పెద్దల పంచాయితీకి వైద్యాధికారులు, పోలీసులూ తలొగ్గారు. ఆదివారం నిశిరాత్రి జరిగిన ఈ దారుణం సోమవారం తెల్లారేసరికి గుట్టుచప్పుడు కాకుండా తొక్కేశారు.  

సాక్షి, గుత్తి రూరల్‌: సూది మందు వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం తొండపాడుకు చెందిన నల్లబోతుల రంగయ్య (45), సునీత దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ రంగయ్య కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జ్వరంతో బాధపడుతున్న రంగయ్య ఆదివారం రాత్రి కుమారుడు సాయంతో గుత్తిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌  కృష్ణప్రసాద్‌ నిర్వహిస్తున్న ప్రైవేట్‌ క్లినిక్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు.

డాక్టర్‌ సూది మందు వేసిన కాసేపటికి రంగయ్య అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీంతో వైద్యుడి సూచన మేరకు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే రంగయ్య మృతి చెందాడు. దీంతో డాక్టర్‌ కృష్ణప్రసాద్‌ వైద్యం సరిగా చేయకపోవడం వల్లనే రంగయ్య మృతి చెందాడంటూ బంధువులు, కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. అప్పటికే అక్కడకు చేరుకున్న డాక్టర్‌ కృష్ణప్రసాద్‌పై దాడికి యత్నించారు. సకాలంలో అక్కడకు చేరుకున్న సీఐ వెంకటరామిరెడ్డి, సిబ్బంది వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారు.  

చదవండి: (అందం చూసి అనుమానం.. నవ వివాహితను చంపిన సైకో భర్త)

డ్యూటీ సమయంలోప్రైవేట్‌ క్లినిక్‌లో 
ఇటీవల బదిలీపై గుత్తి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ కృష్ణప్రసాద్‌.. స్థానికంగానే ఓ ప్రైవేట్‌ క్లినిక్‌ నిర్వహిస్తూ అదనపు ఆదాయంపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కాల్‌ డ్యూటీలో ఉన్న ఆయన... తన సొంత క్లినిక్‌లో పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రంగయ్య కుటుంబసభ్యులు నేరుగా ప్రైవేట్‌ క్లినిక్‌కు చేరుకున్నారు. పరీక్షించిన డాక్టర్‌ కృష్ణాప్రసాద్‌ సూది మందు వేసిన కాసేపటికి రంగయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి చేజారుతున్నట్లు గమనించిన డాక్టర్‌ వెంటనే... ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని రోగి కుటుంబసభ్యులకు సూచించినట్లు తెలిసింది. ఘటనపై డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ.. జ్వర తీవ్రత కారణంగానే రంగయ్య మృతి చెందాడని పేర్కొన్నారు. రోగి ప్రాణాలు కాపాడేందుకు తాను చేసిన ప్రయత్నాలు వివరించారు.  

పంచాయితీ పెద్దలు పోలీసులేనా? 
రంగయ్య మృతికి డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌నే కారణమంటూ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ దుప్పటి పంచాయితీకి తెరలేపినట్లు సమాచారం. వైద్యుడిని కాపాడే క్రమంలో బాధిత కుటుంబసభ్యులను రాజీ చేసి రూ.లక్ష పరిహారాన్ని డాక్టర్‌ కృష్ణప్రసాద్‌ చెల్లించేలా ఒప్పందం చేసినట్లు తెలిసింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లు సమాచారం.    

మరిన్ని వార్తలు