టీడీపీ నేత అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పిటిషన్‌

22 Apr, 2022 04:41 IST|Sakshi

12 హెక్టార్లకు అనుమతి తీసుకుని 200 ఎకరాల్లో అక్రమంగా తవ్వకం 

నిజనిర్ధారణ కోసం అడ్వొకేట్‌ కమిషన్‌ను నియమించిన హైకోర్టు  

విచారణ జూన్‌ 16కి వాయిదా

సాక్షి, అమరావతి: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామ పరిధిలో తెలుగుదేశం పార్టీ నేత ఎల్‌.వి.వి.ఆర్‌.వి.ప్రసాద్‌ 12 హెక్టార్ల (30.14 ఎకరాలు) విస్తీర్ణంలో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు తీసుకుని దాదాపు 200 ఎకరాల్లో అక్రమంగా తవ్వేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మనుగడలోలేని సర్వేనంబరుతో తప్పుడు అనుమతులు పొంది కోట్ల రూపాయల మేర ఖనిజ సంపదను దోచేశారని, ఆ సర్వేనంబర్లలో ఖనిజ తవ్వకాలు చేపట్టకుండా సదరు నేతను ఆదేశించాలని కోరుతూ మద్దూరు గ్రామానికి చెందిన వై.రంజిత్‌కుమార్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. నిజనిర్ధారణ చేసేందుకు హైకోర్టు న్యాయవాది అశ్వత్థనారాయణను అడ్వొకేట్‌ కమిషన్‌గా  నియమించింది. అడ్వొకేట్‌ కమిషన్‌కు ఖర్చుల కింద రూ.30 వేలు చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.

అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి సర్వేయర్‌ సహాయంతో పూర్తి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని అడ్వొకేట్‌ కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అంతకుముందు పిటిషనర్‌ న్యాయవాది బి.చంద్రశేఖర్‌ వాదనలు వినిపిస్తూ.. అక్రమ మైనింగ్‌ చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల సాయంతోనే ఎల్‌.వి.వి.ఆర్‌.వి.ప్రసాద్‌ అక్రమ మైనింగ్‌ చేయగలిగారని పేర్కొన్నారు. ఈ అక్రమ మైనింగ్‌పై ఫొటోలతో సహా అధికారులకు వివరించినా ప్రయోజనం లేకపోయిందని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. 

మరిన్ని వార్తలు