ముఖ్యమంత్రి మతంపై పిటిషన్

20 Oct, 2020 04:14 IST|Sakshi

ఆధారాల్లేకుండా ఎలా మాట్లాడతారు?: హైకోర్టు 

సాక్షి, అమరావతి: తగిన ఆధారాలు, సమాచారం లేకుండా కోర్టులను ఆశ్రయించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము ఆధారాలు అడిగిన తరువాత సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటామని పిటిషనర్లు పేర్కొనడం ఎంత మాత్రం సరికాదని స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మతం గురించి ఎలా మాట్లాడతారని పిటిషనర్‌ ఆలోకం సుధాకర్‌బాబును హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. ఆధారాలు లేకుండా ఈ కేసులో ముందుకెళ్లలేమని తేల్చి చెప్పింది. తన మతం ఏమిటో బహిర్గతం చేసేలా ముఖ్యమంత్రినే ఆదేశించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

మీరు పిటిషన్  దాఖలు చేస్తే, ముఖ్యమంత్రి ఎందుకు ఆధారాలు చూపాలని ప్రశ్నించింది.ఈ వాజ్యంలో గవర్నర్‌ను ప్రతివాదుల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రకటిస్తూ ఈ కేసు విచారణను ఈ నెల 22వతేదీకి వాయిదా వేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్  డిక్లరేషన్  ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమంటూ గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్‌బాబు హైకోర్టులో కో వారెంటో పిటిషన్  దాఖలు చేశారు. డిక్లరేషన్ పై టీవీ చానళ్లలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య ప్రస్తావించగా ‘టీవీ చానళ్ల గురించి అసలు చెప్పొద్దు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు