ఫొటో మార్ఫింగ్‌ మోసాలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!

27 Jul, 2021 21:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెరుగుతున్న ఫొటో మార్ఫింగ్‌ మోసాలు

ఆన్‌లైన్‌ నుంచే ప్రొఫైల్‌ ఫొటోలు తీసుకుని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న దుండగులు

జాగ్రత్త అవసరమంటున్న పోలీసులు   

సాక్షి, శ్రీకాకుళం: వందలాదిగా ఫొటోలను చాలా మంది సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ప్రొఫైల్‌ పిక్స్‌కు లాక్‌ కూడా పెట్టుకోరు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది అంత మంచి పని కాదని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశం ఉందని సైబర్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో వారు అవగాహన కల్పిస్తున్నారు.  

మోసం జరిగే విధానాలు 
సెక్స్‌ టార్షన్‌ సంబంధిత నేరాలు అనేక రకాలుగా జరుగుతాయి. ఇంటర్నెట్‌లో ఉన్న డేటింగ్‌ వెబ్‌సైట్‌/యాప్స్‌లలో సైబర్‌ నేరస్తులు ఆకర్షణీయమైన ఫేక్‌ ప్రొఫైల్‌ పెడతారు. మొదట్లో తియ్యటి మోటలతో బాధితులను నమ్మించి, వారి ప్రైవేట్‌ ఫొటోలు, వీడియోలను తీసుకుని తర్వాత బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెడతారు. సైబర్‌ నేరస్తులు ఇంటర్నెట్‌లో ఫేక్‌ మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లు కూడా రిజిస్టర్‌ చేసి ఆకర్షణీయమైన ఫేక్‌ ప్రొఫైల్స్‌ను ఉంచుతారు. ఎవరైనా వీరి ఉచ్చులో పడితే పై మాదిరిగా బ్లాక్‌మెయిల్‌ చేసి దోచుకుంటారు. కొన్నిసార్లు బాధితునికి నేరస్తునిపై పూర్తి నమ్మకం కుదరగానే వారితో నీ పేరు మీద ప్లాట్‌/హౌస్‌ కొంటున్నానని, కానీ వారి డబ్బులు స్టాక్‌ మార్కెట్‌లో ఇరుక్కున్నాయని, డౌన్‌ పేమెంట్‌ కోసం వారి అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సిందిగా కోరి అందిన కాడికి దోచుకుంటారు.  

పిక్చర్‌ మార్ఫింగ్‌  
సైబర్‌ నేరస్తులు ఐడెంటిటీ థెఫ్ట్‌› ద్వారా బాధితుని ఫొటోలు దొంగిలించి వాటిని మార్ఫింగ్‌ చేస్తారు. ఇంటర్నెట్‌/సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్‌ చేస్తామని, బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బును దోచుకోవడం లేదా లైంగికంగా వేధించడం చేస్తారు. వాట్సాప్‌లు, ఫేస్‌ బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సైబర్‌ నేరస్తులు బాధితులను ఆకర్షించి వారితో సెక్స్‌ చాట్స్, న్యూడ్‌ వీడియో కాల్స్‌కు ప్రేరేపించి వాటిని రికార్డు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తామని, ఫ్యామిలీ/ఫ్రెండ్స్‌కు పంపిస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. హనీ ట్రాప్‌లో ఇది ఒక కొత్త తరహా నేరం. ఈ సైబర్‌ నేరాల్లో స్త్రీలే ఎక్కువగా బాధితులైనప్పటికీ చాలాచోట్ల మగవారు కూడా బాధితులైన ఘటనలు ఉన్నాయి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
► ఇంటర్నెట్‌లో ఉండే డేటింగ్‌ వెబ్‌సైట్‌/యాప్స్, ఫేక్‌ మాట్రిమోనియల్‌ సైట్లలో ఉండే ఫేక్‌ ప్రొఫైల్స్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలి. 
► అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ చాటింగ్‌ లేదా వీడియో కాల్స్‌ వంటివి చేయకూడదు. 
► మన పర్సనల్‌ ఫొటోలు/వీడియోలు ఎవరితోనూ షేర్‌ చేసుకోకూడదు. చాలాసార్లు మనకు బాగా తెలిసిన వ్యక్తే ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారు. 
► సైబర్‌ నేరస్తుల నుంచి మన డేటా లేదా ఐడెంటిటీ థెఫ్ట్‌ కాకుండా సోషల్‌ మీడియా అకౌంట్స్‌కు స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్స్‌ ఉంచుకోవాలి.  
► టీనేజ్‌ పిల్లలు ఇలాంటి సైబర్‌ మోసాలకు తొందరగా ఆకర్షితులవుతారు. వారికి ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా వివరించాలి.    

మరిన్ని వార్తలు