Photo Feature: ఆకులు లేని పూల చెట్టు

11 May, 2022 11:02 IST|Sakshi

వికసించిన ‘మే’ పుష్పం
కాజీపేట: ప్రకృతి ప్రియుల మనసు దోచుకునే మే పుష్పం విరబూసింది. ఏప్రిల్‌ చివరి వారంలో మొగ్గ తొడిగి మే మొదటి వారంలో పువ్వుగా మారడం మే మొక్కకున్న ప్రత్యేకత. అందుకే ఈ పుష్పాన్ని మే పుష్పం అని పిలుస్తుంటారు. కాగా, కాజీపేట 62వ డివిజన్‌ విష్ణుపురి కాలనీకి చెందిన డీసీసీబీ రిటైర్డ్‌ డీజీఎం పాక శ్రీనివాస్‌ మిద్దె తోటలో చాలా అరుదుగా కనిపించే మే పుష్పం మంగళవారం వికసించింది. ఈ పుష్పాన్ని చూడడానికి చుట్టుపక్కల ఇళ్ల వారితో పాటు కాలనీవాసులు అధికంగా తరలివస్తున్నారు.  
-వరంగల్‌


ఆహ్లాదం.. నీలాకాశం 
తుఫాను ప్రభావంతో ఆకాశం నీలం రంగులోకి మారి ఇలా కనువిందు చేసింది. ఏలూరు నగరంలో మంగళవారం సాయంత్రం కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. 
-సాక్షి ఫొటోగ్రాఫర్‌/ ఏలూరు  

 

1920లో నిర్మించిన రక్షణగిరి స్థూపం(నాడు), వందేళ్ల తర్వాత చెక్కు చెదరని రక్షణగిరి స్థూపం (నేడు)

వందేళ్ల జ్ఞాపకం 
రక్షణగిరి పుణ్యక్షేత్ర స్థూపం.. చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తోంది. 1920లో ఫ్రెంచ్‌ మిషనరీ రక్షణగిరి పుణ్యక్షేత్రాన్ని నిర్మించింది. ఇక్కడ నిర్మించిన స్థూపం చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ స్థూపం వద్ద కూర్చొని ప్రార్థనలు చేస్తుంటే మనసుకు ప్రశాంతత చేకూరు
తోందని క్రైస్తవుల విశ్వాసం. 
– జ్ఞానాపురం(విశాఖ దక్షిణ)  

ఆకులు లేని పూల చెట్టు 
చినగదిలిలో నార్త్‌ షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఓ పూల చెట్టు ఆకట్టుకుంటోంది. ఈ చెట్టు ఆకులు çపూర్తిగా రాలిపోయాయి. వాటి స్థానంలో నిండుగా పూసిన గులాబి రంగు పూలతో అలరిస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు ఈ చెట్టు వద్ద ఆగి దీని అందాన్ని తిలకిస్తున్నారు. ఈ పూల చెట్లు బీఆర్‌టీఎస్‌ రోడ్డులో పెదగదిలి నుంచి ముడసర్లోవ వరకు వాహనచోదకులకు కనువిందు చేస్తున్నాయి.
– ఆరిలోవ(విశాఖ తూర్పు)    

మరిన్ని వార్తలు