తిరుమలలో భారీ అగ్నిప్రమాదం : ఫొటోగ్రాఫర్‌ సజీవ దహనం

5 May, 2021 05:11 IST|Sakshi
రోదిస్తున్న మల్లిరెడ్డి భార్య శోభ

ఫొటోగ్రాఫర్‌ సజీవ దహనం

10 దుకాణాలు దగ్ధం

పాక్షికంగా దెబ్బతిన్న 10 షాపులు

రూ.40 లక్షలకుపైగా ఆస్తి నష్టం

తిరుమల: శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆస్థాన మండపం సెల్లార్లోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫొటోగ్రాఫర్‌ సజీవ దహనమయ్యారు. తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ జగన్మోహన్‌రెడ్డి, అగ్నిమాపకశాఖాధికారి ఎం.వెంకటరావిురెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఉదయం 6.30 గంటల సమయంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపకశాఖకు, టీటీడీ భద్రతా విభాగానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదంలో 10 దుకాణాలు పూర్తిగా కాలిపోగా, మరో పది దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాలిపోయిన 84వ నంబరు షాపులో ఒక మృతదేహాన్ని గుర్తించారు. మృతుడిని ఆ షాపులో పనిచేస్తున్న ఫొటోగ్రాఫర్‌ తుమ్మల మల్లిరెడ్డి (45)గా గుర్తించారు. తిరుచానూరులో నివాసం ఉంటున్న మల్లిరెడ్డి రాత్రి షాపులోనే నిద్రపోయాడు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరగడంతో వెలుపలకు రాలేక సజీవంగా కాలిపోయాడు. అతడికి భార్య శోభ, కుమారుడు ఉన్నారు. అగ్నిప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు సీఐ చెప్పారు. ప్రమాదంలో రూ.40 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై, వ్యక్తి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ చెప్పారు.

పరిశీలించిన టీటీడీ ఉన్నతాధికారులు
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, వీజీవో బాలిరెడ్డి, డీఎస్పీ ప్రభాకర్‌రావు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదంపై ఆరాతీశారు.  మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయంత్రం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి.. బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు