ప్రాణాలను పణంగా పెట్టి..

16 May, 2021 04:21 IST|Sakshi

కరోనాకు వెరవకుండా సేవలకు పునరంకితమవుతున్న వైద్యులు

కారంపూడి (మాచర్ల): కోవిడ్‌ నుంచి ప్రజలను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరం విధుల్లో నిమగ్నమవుతూ వైద్యోనారాయణోహరి అన్న పదానికి నిజమైన నిర్వచనంలా నిలుస్తున్నారు అనేక మంది వైద్యులు. కోవిడ్‌ రోగుల సేవలో ఉండగా, తమకూ వైరస్‌ సోకినా..కోలుకుని తిరిగి రోగుల సేవకు పునరంకితమయ్యారు గుంటూరు జిల్లా కారంపూడి, గాదెవారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు బాలకిషోర్‌ నాయక్, ఆంజనేయులు నాయక్‌. డాక్టర్‌ బాలకిషోర్‌ నాయక్‌కు భార్య, కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇంట్లో పసివాడు, పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులు ఉన్న నేపథ్యంలో తమ వల్ల వైరస్‌ వారికి సోకుతుందేమోననే భయంతో ఆయన కుటుంబానికి దూరంగానే గడుపుతున్నారు.

డాక్టర్‌ ఆంజనేయులు నాయక్‌కు భార్య, ఇద్దరు పసి పిల్లలు ఉన్నారు. అతడు కూడా కుటుంబానికి దూరంగా ఉంటూనే తన విధుల్లో నిమగ్నమవుతున్నారు. పిల్లలను చూడాలనుకుంటే దూరం నుంచే చూడటం తప్ప దగ్గరకు తీసుకోలేని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో ప్రజాసేవలో నిమగ్నమవడంలో ఉన్న ఆనందం మరొకటి లేదంటున్నారు. తమకు కరోనా సోకిన సమయంలో తమ కుటుంబాలు పడిన టెన్షన్, తాము అనుభవించిన అనారోగ్య పరిస్థితి ఎవరికీ రాకూడదనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని వారు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు