ప్రేమను గెలిపించిన పిడకల సమరం

15 Apr, 2021 08:58 IST|Sakshi
పిడికల సమరంలో పాల్గొన్న కైరుప్పల గ్రామస్తులు 

కైరుప్పలలో కొనసాగిన సంప్రదాయం

30 మందికి స్పల్ప గాయాలు 

ఆస్పరి: ప్రేమికులను విడదీసిన పెద్దలను చూసుంటాం.. ప్రేమ కథలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలనూ విని ఉంటాం. ప్రేమను గెలిపించే పోరాటం మాత్రం మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పోరాటమే ఒకటి సంప్రదాయంగా బుధవారం ఆస్పరి మండలం కైరుప్పలలో కొనసాగింది. ప్రేమికులైన వీరభద్రస్వామి, కాళికాదేవిని ఒక్కటి చేసింది. గతేడాది కరోనా కారణంగా నిలిచిపోయిన పిడకల సమరం ఈ ఏడాది వేలాది మంది సమక్షంలో హోరాహోరీగా సాగింది.

ఈ సంగ్రామంలో 30 మంది స్వల్పంగా గాయపడ్డారు. సంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నాగభూషణం రెడ్డి గుర్రంపై మందీ మార్బలం, తప్పెట్లు, మేళతాళాలతో కైరుప్పలకు వచ్చారు. దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరగగానే పిడకల  సమరం మొదలైంది. వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గీయులుగా గ్రామస్తులు విడిపోయారు. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు.

వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపైంది. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై   పిడకలు విసురుకుంటూ గుంపులు, గుంపులుగా ప్రజలు కదిలారు. ఒక సారి ఒక వర్గం వారిది పైచేయి అయితే, మరో సారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. తమ వర్గం వారు గెలవాలనే తపనతో మహిళలు పిడకలు అందిస్తూ సాయంగా నిలిచారు. కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు అరగంట పాటు పోరు కొనసాగింది. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి బండారు అంటించుకుని వెళ్లారు.

సంగ్రామం ముగిసిన తరువాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి.. కాళికాదేవి, వీరభద్రస్వామి వివాహానికి అంగీకారం తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. వేడుకలో గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. ఆలూరు సీఐ భాస్కర్, ఎస్‌ఐ గిరిబాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈఓ రమేష్, సర్పంచ్‌ తిమ్మక్క, గ్రామ పెద్దలు ఉత్సవంలో పాల్గొన్నారు.
చదవండి:
పిల్లకు పాలు.. తల్లికి కూల్‌ డ్రింక్‌ 
లోకేష్‌, అచ్చెన్న ఎడమొహం.. పెడమొహం

మరిన్ని వార్తలు