గంగవరం పోర్టులో.. ప్రభుత్వ వాటా ఉపసంహరణపై పిల్‌

10 Sep, 2021 04:58 IST|Sakshi

అంతర్జాతీయ బిడ్లు ఆహ్వానించేలా కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించాలన్న పిటిషనర్లు

పూర్తి వివరాల సమర్పణకు గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం

విచారణ ఈ నెల 20కి వాయిదా

సాక్షి, అమరావతి: కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌) స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై దర్యాప్తు జరిపేలా ఏపీ లోకాయుక్తను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రొప్రయిటీ ఆడిట్‌ కూడా నిర్వహించేలా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన డాక్టర్‌ వైజా సత్యభూపాల్‌రెడ్డి, బొంత పూర్ణచంద్రారెడ్డిలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాల విక్రయం, కృష్ణపట్నం పోర్టు స్వాధీనం తదితరాల వ్యవహారంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని తెలిపారు. వాటాల విక్రయ వ్యవహారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని, అందుకు సంబంధించిన జీఓలను సైతం అందుబాటులో లేకుండా చేసిందని చెప్పారు. వాటాల ఉపసంహరణకు అంతర్జాతీయ స్థాయిలో బిడ్లు ఆహ్వానించి ఉంటే మరింత ఆదాయం ప్రభుత్వానికి వచ్చి ఉండేదన్నారు.

లబ్ధిదారులను ప్రతివాదులుగా చేర్చాలి
ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధిదారులుగా ఉన్న కంపెనీలను ప్రతివాదులుగా చేయలేదన్నారు. వారిని ప్రతివాదులుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగానే వాటాల ఉపసంహరణ జరిగిందని చెప్పారు. ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని తెలిపారు. గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు