ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా ఆదేశించండి

27 May, 2021 05:36 IST|Sakshi

హైకోర్టులో నేడు విచారణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి, పదో తరగతి పరీక్షలు మొదలు కావడానికి ముందే ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్‌ ప్రక్రియను పూర్తి చేసేలా ఆదేశాలివ్వాలంటూ శ్రీకాకుళానికి చెందిన ఉపాధ్యాయుడు వై.ఉమాశంకర్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తులు జస్టిస్‌ దొనడి రమేశ్, జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఉపాధ్యాయులు ప్రతీ రోజూ వందల మంది విద్యార్థులతో మాట్లాడుతుంటారని, అందువల్ల అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఉపాధ్యాయులకు వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.  

మరిన్ని వార్తలు