‘వట్టి వసంతకుమార్‌ నాకు మంచి మిత్రుడు’

29 Jan, 2023 16:27 IST|Sakshi

ఏలూరు: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌. వట్టి వసంత కుమార్‌ మరణ వార్త తెలుసుకున్న అనంతరం పూళ్ల గ్రామానికి వెళ్లిన సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. ‘ వట్టి వసంతకుమార్‌ నాకు మంచి మిత్రుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. దివంగత మహానేత వైఎస్సార్‌తో అత్యంత సన్నిహిత ఉన్న వ్యక్తి వట్టి వసంత కుమార్‌. వితౌట్‌ అపాయింట్‌ లేకుండా వైఎస్సార్‌ను కలిసే వ్యక్తుల్లో ఉండవల్లి తరువాత వట్టి వసంత కుమార్‌ ఒకరు. రాజకీయంలో నా ఎదుగుదలకు ఎంతో సహకరించారు వట్టి వసంత కుమార్‌’ అని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వట్టి వసంత కుమార్‌
వట్టి వసంత కుమార్‌ మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి వట్టి వసంత కుమార్‌ అని, నాకు అన్నతో సమానమని, నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధికి వట్టి ఎంతో కృషి చేశారన్నారు. ఆక్వా రంగంలో ట్యాక్స్‌ మినహాయింపునకు వసంత కుమార్‌ చేసిన కృషి మరవలేనిదన్నారు రఘువీరా.


ఉభయ గోదావరి జిల్లాలో మంచి నాయకుడు వట్టి వసంత కుమార్‌
వైఎస్సార్‌కు మంచి స్నేహితుడు వట్టి వసంత కుమార్‌ అని మంత్రి దాడిశెటట్టి రాజా పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో మంచి నాయకుడు వట్టి వసంత కుమార్‌ అని, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో వసంతకుమార్‌ అంత్యక్రియలు
ఏలూరు ఎంఎం పురంలో వట్టి వసంతకుమార్‌ అంతిమ యాత్రలో మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్యే వాసుబాబు, కాంగ్రెస్‌ నేతలు, సినీ నిర్మాత అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో వట్టి వసంతకుమార్‌ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ కన్నుమూత

>
మరిన్ని వార్తలు