రికార్డుల స్వచ్ఛీకరణ సవాలే!

8 Oct, 2020 03:40 IST|Sakshi

చనిపోయిన వారి పేరుతో లక్షలాది ఎకరాల భూములు

ప్రభుత్వం సేకరించిన భూమి కూడా పాత యజమానుల ఖాతాల్లోనే

భాగపరిష్కారాలు కానివి కోకొల్లలు

ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్‌ మధ్య వ్యత్యాసం

ఒకే భూమికి ఇద్దరు ముగ్గురికి పట్టా

విచారించి పక్కాగా చేయకపోతే చిక్కులే

ప్రక్షాళన చేస్తేనే రీసర్వేకు మార్గం సుగమం.. ప్రత్యేక డ్రైవ్‌ అవసరమంటున్న రెవెన్యూ నిపుణులు

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వేకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో తప్పుల తడకగా ఉన్న భూ రికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియ రెవెన్యూ శాఖకు అతి పెద్ద యజ్ఞంలా మారింది. ప్రస్తుత ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం కేవలం స్వచ్ఛీకరణ కాదని, ఇది రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ అని రెవెన్యూ శాఖ మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ధర్మాన ప్రసాదరావు పలుమార్లు పేర్కొన్నారు. దీనిని పకడ్బందీగా చేస్తే చాలా వరకు భూ వివాదాలు పరిష్కారమవుతాని రెవెన్యూ, న్యాయ రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. పక్కాగా, లోప రహితంగా రికార్డులను అప్‌డేట్‌ చేయాలంటే రెవెన్యూ ఉద్యోగులు జవాబుదారీతనంతో పని చేయాల్సి ఉంటుంది.

కష్టమైన ప్రక్రియే..
► రాష్ట్రంలో 4 కోట్ల ఎకరాలకు (1.63 లక్షల చదరపు కిలోమీటర్ల) పైగా ప్రభుత్వ, ప్రయివేటు భూములున్నాయి. 17,460 గ్రామాల పరిధిలో 1.96 కోట్ల సర్వే నంబర్ల పరిధిలో 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి 90 లక్షల మంది రైతుల చేతుల్లో ఉంది. 
► మొత్తం 3 కోట్ల ల్యాండ్‌ హోల్డింగ్స్‌ ఉండగా, వీటిలో ప్రభుత్వానికి చెందినవి 43 లక్షలు. ఇందులో లక్షలాది ఎకరాలు ఆక్రమణదారుల గుప్పెట్లో ఉన్నాయి. 
► చాలా చోట్ల భూ అనుభవ రికార్డులు (అడంగల్‌), భూ యాజమాన్య రికార్డులు (1బి)లను మార్చి వేశారు. అసైన్‌మెంట్‌ రిజిష్టర్లను మాయం చేశారు. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం సేకరించిన భూమి చాలా చోట్ల ఇప్పటికీ ప్రయివేటు వ్యక్తుల పేర్లతోనే ఉంది. 

అక్రమాల పుట్టలు..
► రెవెన్యూ రికార్డులు అక్రమాల పుట్టలుగా మారాయి. ఏటా జరపాల్సిన రెవెన్యూ జమా బందీ దశాబ్దాలుగా నిర్వహించకపోవడం ఇందుకు ప్రధాన కారణం.  
► ఒకే భూమికి ఇద్దరు ముగ్గురికి దరఖాస్తు (డీకేటీ) పట్టాలు ఇచ్చిన సంఘనటలు కోకొల్లలుగా ఉన్నాయి. కొందరు రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులు కూడా ఇలా నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడ్డారు. 
► ఒక సర్వే నంబరులో 10 ఎకరాల భూమి ఉంటే 20 ఎకరాలకు డీకేటీ పట్టాలు/ అడంగల్స్‌ ఉన్నవి కూడా చాలా చోట్ల ఉన్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు లెక్కే లేదు. 

దశాబ్దాలుగా మార్పులే లేవు
► ఎప్పటికప్పుడు రికార్డుల్లో మార్పులు చేర్పులు (అప్‌డేట్‌) చేయడాన్నే స్వచ్ఛీకరణ (మ్యుటేషన్‌) అంటారు. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా భూ రికార్డులు అప్‌డేట్‌ చేయకుండా వదిలేశారు. దశాబ్దాల కిందట చనిపోయిన వారి పేర్లతో లక్షలాది ఎకరాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాస్తవ భూమి విస్తీర్ణానికీ, రికార్డుల్లో ఉన్న దానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. 
► ఇలా రికార్డుల్లో తేడా ఉన్న సర్వే నంబర్లలోని భూమి యజమానులతో మాట్లాడి ఒప్పించి ఆయా వ్యక్తుల పేర్లతో ఉన్న భూమి విస్తీర్ణాన్ని ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రామాణికంగా తగ్గించడం చాలా క్లిష్టమైన సమస్య.
► తల్లిదండ్రులు చనిపోయినా వారి పిల్లలు భాగపరిష్కారాలు చేసుకోకుండా తలా కొంత దున్నుకుంటున్నారు. రికార్డుల్లో చనిపోయిన తల్లిదండ్రుల పేరుతోనే భూమి ఉంది. 
► చాలా చోట్ల భూమి కొన్న వారి బదులు అమ్మిన వారి పేర్లతోనే అడంగల్, 1బీలో భూమి ఉంది. వీటిని సరిచేయాల్సి ఉంది. 
► భూమిలేని పేదల పేరుతో ప్రభుత్వం అసైన్‌మెంట్‌ పట్టాలు ఇస్తోంది. భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అసైన్‌మెంట్‌ రిజిస్టర్లను మాయం చేసి చాలా మంది ప్రభుత్వ భూములను అసైన్‌మెంట్‌ పట్టాలంటూ దున్నుకున్నారు. మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాల ద్వారా అమ్ముకున్నారు. 

పకడ్బందీగా ఏర్పాట్లు
సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి భూ రికార్డులను పకడ్బందీగా, పారదర్శకంగా స్వచ్ఛీకరించాల్సి ఉంది. జనవరి ఒకటో తేదీ నుంచి తొలి విడత రీసర్వే చేపట్టనున్న 6,500 గ్రామాల్లో రికార్డులు ముందు పెట్టుకుని టేబుల్‌ వెరిఫికేషన్‌ చేయాలని ఇప్పటికే రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్‌ మధ్య విస్తీర్ణంలో తేడాలు ఇక్కడ చాలా వరకు తేలే అవకాశం ఉంది. భూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఒకపక్క, భూముల సమగ్ర రీసర్వేకు మరో పక్క చకచకా ఏర్పాట్లు చేస్తున్నాం. 
– వి.ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి

ఆర్‌ఎస్‌ఆర్‌ అడంగల్‌ మధ్య 33.54 లక్షల ఎకరాల తేడా
రెవెన్యూ శాఖలో అత్యంత ప్రామాణికమైనది రీసర్వే సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌). బ్రిటిష్‌ కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం భూమిని సర్వే చేసినప్పుడు సర్వే నంబర్ల వారీగా ఎంతెంత భూమి ఉందో ఆర్‌ఎస్‌ఆర్‌లో  నమోదు చేశారు. అయితే ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్‌ మధ్య 33.54 లక్షల ఎకరాలకుపైగా వ్యత్యాసం ఉండటం రెవెన్యూరికార్డులు తప్పుల తడకలుగా ఉన్నాయనడానికి నిదర్శనం. అడంగల్, భూమి కొలతల పుస్తకం (ఎఫ్‌ఎంబీ) మధ్య కూడా ఇలాగే భారీ తేడా ఉంది.  

భూమి ఎవరిదో రెవెన్యూకే తెలియదు!
రాష్ట్రంలో చాలా కుటుంబాలకు వంశ పారంపర్యంగా భూమి సంక్రమించి ఉంటుంది. ఇలాంటి వారిలో కొందరి వద్ద భూమి తమదేననడానికి రాత పూర్వకమైన ఆధారాలు ఉండకపోవచ్చు. రెవెన్యూ శాఖ వద్ద కూడా చాలా వరకు రికార్డులు లేవు. అందుకే వెబ్‌ల్యాండ్, అడంగల్‌లో చాలా భూమి అన్‌సెటిల్డ్‌ అని, తెలియదు అని ఉంది. ఇలాంటి భూమి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉంది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు