గుంటూరు జిల్లాతో పింగళికి ప్రత్యేకానుబంధం

2 Aug, 2022 14:14 IST|Sakshi

మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. జాతీయోద్యమంలో గళమెత్తిన మన ప్రాంతవాసులెందరో.. వీరిలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఒకరు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో ఆ మహానుభావునికి ప్రత్యేక అనుబంధం ఉంది. నేడు ఆయన జయంత్యుత్సవం సందర్భంగా మహనీయుని మధుర స్మృతులను ఓసారి మననం చేసుకుందాం.

సాక్షి, టూరు: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జాతీయ జెండా రూపకర్త, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ  జయంత్యుత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. 

జిల్లాలో స్థిరపడిన పింగళి కుటుంబం 
పింగళికి ఉమ్మడి గుంటూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధముంది. 1913 బాపట్లలో సర్‌ బయ్యా నరసింహేశ్వర శర్మ అధ్యక్షతన జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభలో పింగళి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఆ తర్వాత పలుమార్లు జిల్లాను సందర్శించి ఇక్కడి నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య పంతులు, పావులూరి శివరామ కృష్ణయ్య తదితర ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పింగళి కుటుంబ సభ్యులు 50 ఏళ్ళ క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో స్థిరపడ్డారు.  

జెండా రూపకల్పనకు బీజం పడింది ఇలా..  
అది 1906. కోల్‌కతా మహానగరంలో కాంగ్రెస్‌ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భం. అప్పటి వరకు ఏ సభలు జరిగినా బ్రిటిషు జెండా ఆవిష్కరణ, వారి జాతీయ గీతం ఆలాపన ఆనవాయితీగా ఉండేది. ఆ సభలోనూ అదే తంతు జరగడం పింగళి వెంకయ్యకు నచ్చలేదు. ఇదే విషయాన్ని తన గురువు బాలగంగాధర్‌ తిలక్‌ వద్ద ప్రస్తావించారు. మనం స్వాతంత్య్రం సాధిస్తే మనకూ ఓ కొత్త జెండా వస్తోంది అని తిలక్‌ అన్న మాటలు  పింగళి మనస్సులో బలంగా నాటుకున్నాయి. దీంతో ఆయన జాతీయ జెండా రూపకల్పనపై దృష్టిసారించారు. వివిధ దేశాల జెండాలను పరిశీలించి సుమారు 30 నమూనాలను తయారు చేశారు. ఈ క్రమంలోనే మరి కొందరు దేశ భక్తులూ జాతీయ జెండా నమూనాలు తయారు చేసే యత్నం చేశారు. పింగళి 1916లో ‘ఏ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా’ (భారత దేశానికి ఒక జాతీయ పతాకం) పుస్తకాన్ని రచించారు. ఇందులోని ప్రధాన అంశాలు ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అప్పటి ప్రముఖ స్వాత్రంత్య్ర సమరయోధులు దాదాబాయ్‌ నౌరోజీ, బాలగంగాధర్‌ తిలక్, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులు ఈ పుస్తకాన్ని కొనియాడారు. ఫలితంగా ఈ పుస్తకం గాంధీ మహాత్ముడి దృష్టిలో పడింది.
  
మహాత్ముని సూచనల మేరకు  
1921లో  విజయవాడలో జాతీయ కాంగ్రెస్‌ మహా సభ జరుగుతున్న సమయంలో పింగళి మహాత్మా గాంధీని కలిశారు.  ఆయన అభీష్టం మేరకు తొలుత కేవలం పచ్చ, ఎరుపు రంగులతో జాతీయ జెండాను రూపొందించారు. ఆ తర్వాత మహాత్ముడి సూచనలు, సలహాల మేరకు త్రివర్ణ పతాకం రూపొందింది. మొదట్లో మధ్యలో రాట్నం గుర్తు ఉండేది. ఆ తర్వాత అనేక మార్పులు జరిగి  1947లో స్వాతంత్య్రం సిద్ధించే నాటికి మువ్వన్నెల జెండా మధ్యలో అశోక చక్రంతో దేశ ప్రజల ముందు ఆవిష్కృతమైంది. జాతీయ  జెండా రూపకల్పనలో పింగళి కృషిని మహాత్మా గాంధీ ‘ది యంగ్‌ ఇండియా’ పత్రికలో రాసిన వ్యాసంలో ప్రత్యేకంగా కొనియాడడం విశేషం.    


పింగళి కుటుంబానికి సీఎం సముచిత గౌరవం  

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది మార్చి 12న మాచర్లలో పింగళి కుమార్తె సీతా మహాలక్ష్మిని సముచితంగా సత్కరించారు.  రూ.75 లక్షల చెక్కు, మెమెంటో అందజేశారు. ఇటీవల సీతామహాలక్ష్మి మరణిస్తే ఆమె అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఈనెల 1 నుంచి 15 వరకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పింగళి జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్‌లో పింగళి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పింగళి కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రి ఔదార్యాన్ని ప్రశంసించడం, ఆయనకు ధన్యవాదాలు తెలపడం గమనార్హం.   


తాత జ్ఞాపకాలు అజరామరం 

జాతీయ జెండా రూపకల్పన చేసిన మా తాత పింగళి వెంకయ్యను ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా కీర్తించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా కుటుంబంపై చూపుతున్న ప్రత్యేకాదరణకు ధన్యవాదాలు. నాకు పదిహేడేళ్ల వయస్సులో తాత మరణించారు. ఆయనతో నాకున్న కొద్దిపాటి జ్ఞాపకాలు ఎప్పటికీ అజరామరమే. 
– జి.వి.ఎన్‌.నరసింహం, పింగళి వెంకయ్య మనవడు, పింగళి జీవిత చరిత్ర రచయిత  


పింగళికి భారతరత్న ఇవ్వాలి 

కేవలం జాతీయ జెండా రూపకల్పన మాత్రమే కాకుండా దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన బహుముఖ ప్రజ్జాశాలి, బహు భాషా కోవిధుడు పింగళి వెంకయ్యకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రధాని మోదీకి పలుమార్లు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పింగళికి తగిన గౌరవం ఇవ్వడంతో సర్కారు సహకారంతో ముందుకెళ్తాం. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా  పింగళిని స్మరించుకోవడం సంతోషం. 
– స్వామి జ్ఞానప్రసన్న, అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు

మరిన్ని వార్తలు