నిబంధనలు అనుసరించి ప్రయాణాలు ప్లాన్‌ చేసుకోండి

25 May, 2021 05:46 IST|Sakshi

అనుమతులు లేకుండా వెళ్లి చెక్‌ పోస్టుల వద్ద ఇబ్బందులు పడొద్దు

డీజీపీ కార్యాలయం ప్రకటన

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారు ఆయా రాష్ట్రాల్లో ఈ పాస్‌ నిబంధనల్ని ముందుగానే గమనించి ప్రయాణాలు ప్లాన్‌ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వారు సరిహద్దుల్లోని చెక్‌ పోస్టుల వద్ద అవస్థలు పడుతున్న దృష్ట్యా డీజీపీ కార్యాలయం సోమవారం సూచనలు జారీ చేసింది. 

ఏపీకి రావాలంటే..
ఏపీలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాష్ట్రానికి రావాలనుకొనే వారు ఉదయం 6 నుంచి 12  గంటల మధ్యనే ప్రయాణించేలా.. ఆ లోపే గమ్యానికి చేరుకునేలా ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలి. అటువంటి వారికి పాస్‌లు అవసరం లేదు. మిగతా సమయంలో ప్రయాణిస్తే ఈ–పాస్‌ కచ్చితంగా తీసుకోవాలి. ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర సేవలు, అంబులెన్స్‌ తదితర సేవలు, సంబంధిత సిబ్బందికి ఈ–పాస్‌ అవసరం లేదు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు అంబులెన్స్‌లో ప్రయాణించే పేషెంట్‌లతో ఉండే సహాయకులకు అనుక్షణం సహాయ, సహకారాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ సామాజిక మాధ్యమాలు (ట్విట్టర్, ఫేస్‌బుక్‌) ద్వారా నిరంతరం అందుబాటులో ఉంటుంది. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు లోబడి సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలి. ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయంలో ఇంటిపట్టున ఉంటూ స్వీయ రక్షణ పొందాలని పోలీస్‌ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఏపీలో ప్రయాణించాలంటే..
ఏపీ పరిధిలో ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్యే ప్రయాణించేలా.. ఆలోపే గమ్యాన్ని చేరుకునేలా ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోగలిగితే ఎలాంటి పాస్‌లు అవసరం లేదు. మిగతా సమయాల్లో ప్రయాణిస్తే మాత్రం ఈ–పాస్‌ కచ్చితంగా తీసుకోవాలి. అటువంటి వారు తగిన ధ్రువీకరణ పత్రాలతో ఈ–పాస్‌కు దరఖాస్తు చేసి అనుమతి పొందాలి.  ఏపీలో కర్ఫ్యూ సమయంలో ప్రయాణానికి సిటిజన్‌ సర్వీస్‌ పోర్టల్‌ (http://appolice. gov.in),  ట్విట్టర్‌ (@ APPOLICE100), ఫేస్‌ బుక్‌ (@ ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈ–పాస్‌ పొందవచ్చు.

ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే..
► తెలంగాణ వెళ్లాలంటే ఈ పాస్‌ తప్పనిసరి. అక్కడ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూ ఉండదు. మిగతా సమయాల్లో కర్ఫ్యూ ఉంటుంది. కానీ తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించాలంటే.. కర్ఫ్యూ ఉన్నా లేకపోయినా ఈ పాస్‌ తప్పనిసరి. https://policeportal. tspolice.gov.in/ ద్వారా తెలంగాణ ఈ–పాస్‌ పొందిన తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుంది.
► తమిళనాడులో పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంది. తమిళనాడు భూ భాగంలోకి ప్రవేశించాలంటే ఈ–పాస్‌ తప్పనిసరి.  https:// eregister.tnega.org/  ద్వారా తమిళనాడు ఈ–పాస్‌ 
పొందవచ్చు.
► ఒడిశాలో పూర్థిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఆ రాష్ట్రంలోకి ప్రవేశించాలన్నా ఈ–పాస్‌ తప్పనిసరి. https://covid19regd. odisha.gov.in/ లింక్‌ ద్వారా ఈ–పాస్‌ పొందవచ్చు. 
► కర్ణాటకలోనూ పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలులో ఉంది. కర్ణాటక భూభాగంలోకి ప్రవేశించాలంటే ఈ పాస్‌ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లింక్‌ ద్వారా కర్ణాటకలోకి వెళ్లేవారు ఈ–పాస్‌ పొందవచ్చు. కర్ణాటక ప్రభుత్వం అవసరాన్ని బట్టే వారి భూ భాగంలోకి ప్రవేశానికి అనుమతి ఇస్తుంది.  

>
మరిన్ని వార్తలు