ప్లాస్మా దాతలు 1,475 మంది

8 Oct, 2020 04:04 IST|Sakshi

అత్యధికంగా గుంటూరు జిల్లాలో 322 మంది 

ఇప్పటివరకు ప్లాస్మా చికిత్స తీసుకున్న వారు 1,385 మంది

మూడు జిల్లాల్లో ప్లాస్మా దాతలు లేరు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సోకి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉన్నవారికి ప్రాణావసరమైన ప్లాస్మా దానానికి పలువురు ముందుకు వస్తున్నారు. కోవిడ్‌ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారి నుంచి ప్లాస్మా సేకరించి అవసరమైన రోగులకు ఇవ్వడం ద్వారా వారు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే 1,475 మంది ప్లాస్మా దానం చేయగా మరో 2,600 మంది ప్లాస్మా ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్‌ సోకి 6.72 లక్షల మందికిపైగా కోలుకున్నారు. వీరిలో మరింతమంది ముందుకొచ్చి ప్లాస్మా దానం చేస్తే ఎందరో రోగులకు ఉపయోగపడుతుంది. ప్లాస్మాను ఏడాదిపాటు నిల్వ ఉంచవచ్చు. 

► ఇప్పటివరకు మన రాష్ట్రంలో 1,475 మంది నుంచి 1,838 యూనిట్ల ప్లాస్మా సేకరించారు.
► ఇప్పటివరకు 1,385 మందికి ప్లాస్మా చికిత్స చేశారు. 
► అత్యధికంగా గుంటూరు జిల్లాలో 322 మంది ప్లాస్మా దానం చేయగా 302 మంది చికిత్స  చేయించుకున్నారు.
► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 301 మంది ప్లాస్మా దానం చేయగా 280 మందికి ప్లాస్మా చికిత్స చేశారు. కోవిడ్‌ విస్తరణ ఆలస్యంగా జరిగిన శ్రీకాకుళం జిల్లాలో 227 మంది ప్లాస్మా దానం చేయగా 200 మందికి చికిత్స జరిగింది. చిత్తూరు, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు కూడా ప్లాస్మా దానం చేయలేదు. ఈ జిల్లాల్లో ఒక్కరికి కూడా ప్లాస్మా చికిత్స చేయలేదు.

ప్లాస్మా డొనేషన్‌కు ముందుకు రావాలి
అవగాహన లేకపోవడంతో ప్లాస్మా డొనేషన్‌కు చాలామంది ముందుకు రావడం లేదు. కోవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో నలభై ఏళ్లలోపు యువకులు చాలామంది ఉన్నారు. వీళ్లంతా ప్లాస్మా ఇస్తే మరింతమందిని బతికించవచ్చు. ప్లాస్మా చికిత్స కూడా వెంటిలేటర్‌కు వెళ్లాక ఇవ్వడం కాదు.. ఆక్సిజన్‌ బెడ్‌పై ఉన్నప్పుడే ఇవ్వాలి. పేషెంటు చివరి దశలో ఉన్నప్పుడు ఇస్తే ఫలితం ఉండదు. నిర్థారణ పరీక్షల ఆధారంగా ముందస్తుగానే ప్లాస్మా చికిత్స చేయాల్సి ఉంది.
–డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, ప్రత్యేక అధికారి, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం 

మరిన్ని వార్తలు