ఒకేచోట.. నచ్చిన ఆట

4 Mar, 2022 05:24 IST|Sakshi

ఆధునికతకు తగిన విధంగా ఆట స్థలాలు

కొద్దిపాటి ప్రాంగణంలోనే అభిరుచికి తగినట్టు ఆటలు

శాప్‌ ఆధ్వర్యంలో ‘స్పోర్ట్స్‌ అరేనా’

తొలి దశలో మునిసిపాలిటీల్లో ఆధునిక ఆట స్థలాలు

ప్రయోగాత్మకంగా గుంటూరులో నిర్వహణ

సాక్షి, అమరావతి: యువతలో క్రీడాసక్తిని పెంపొందించడంతో పాటు.. అన్ని వర్గాల ప్రజలు ఆడుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధునిక ఆట స్థలాలను అభివృద్ధి చేస్తోంది. ‘స్పోర్ట్స్‌ అరేనా’ ప్రాజెక్టు పేరుతో తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మునిసిపాలిటీలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరులో పైలట్‌ ప్రాజెక్టుగా నిర్వహించేందుకు టెండర్లు సైతం ఆహ్వానించింది. అన్ని జిల్లాల్లో డీఎస్‌ఏ (డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ) ప్రాంగణాలు, మునిసిపాలిటీల నుంచి స్థలాలను సేకరించి నిర్మాణాలు చేపట్టనుంది. 

ఏ ఆటైనా ఆడేందుకు అనువుగా..
ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆట స్థలాలను మర్చిపోతున్నారు. ఎవరైనా ఆడుకుందామన్నా అనువైన ప్రదేశాలు లేక అభిరుచిని చంపేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రైవేట్‌ రంగంలో స్పోర్ట్స్‌ అరేనాలు వెలిశాయి. గంటల లెక్కన అద్దె వసూలు చేస్తూ ఆడుకోవాలనే అభిలాష ఉన్నవారికి క్రీడా వేదికను కల్పిస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా చక్కటి వాతావరణం, రాత్రి వేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ ఆటలను ఎంజాయ్‌ చేసేలా అవకాశం కల్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో క్రీడా ప్రమాణాలను పాటిస్తూ శాప్‌ స్వయంగా అరేనాలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది.

ఔత్సాహికులకు ఆడుకునే స్వేచ్ఛను కల్పిస్తూనే ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు రచిస్తోంది. సాధారణ క్రీడా మైదానాలతో పోలిస్తే అరేనా ప్రాంగణాలు విభిన్నంగా ఉంటాయి. కొద్దిపాటి స్థలంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటలు ఆడుకునేందుకు వీలుంటుంది. మట్టి కనిపించకుండా ఆట స్థలం మొత్తం నెట్స్‌లో ఉండి.. టర్ఫ్‌తో కప్పి ఉంటుంది. ఒకే ప్రదేశం.. అనేక రకాల ఆటలకు నెలవుగా వీటిని రూపొందిస్తారు. ఈ స్పోర్ట్స్‌ అరేనాల్లో క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌ బాల్, టెన్నిస్, వాలీబాల్, యోగా ఇలా.. నచ్చిన క్రీడలను ఆడి ఆస్వాదించవచ్చు.  

ఆధునికతకు అనుగుణంగా..
ప్రస్తుత కాలానికి తగిన విధంగా ఆట స్థలాలు ఉండాలి. అందరూ మట్టి క్రీడా ప్రాంగణాల్లో ఆడేందుకు ఆసక్తి చూపరు. కానీ వారికి ఆడుకోవాలనే కోరిక ఉంటుంది. అటువంటి ఔత్సాహిక క్రీడాకారుల కోసమే స్పోర్ట్స్‌ అరేనాలను తీసుకొస్తున్నాం. ఒకేచోట తమకు నచ్చిన క్రీడను ఎంజాయ్‌ చేసే సౌలభ్యం ఇందులో ఉంటుంది. అన్ని వయసుల వారు ఇందులో ఆడుకునేందుకు ఇష్టపడతారు. 
– ఎన్‌.ప్రభాకరరెడ్డి, ఎండీ, శాప్‌  

మరిన్ని వార్తలు