Places To Visit In West Godavari: ఆహ్లాదం.. వన విహారం

5 Nov, 2022 09:58 IST|Sakshi

పశ్చిమ గోదావరి (బుట్టాయగూడెం): కార్తీకమాసం అంటే కేవలం భక్తితో పూజలు చేయడమే కాదు. పర్యాటకుల సందడి కూడా ఎక్కువగా ఉంటుంది. వన విహారాల పేరిట పర్యాటక ప్రాంతాలు సందడిగా మారతాయి. అలాంటి వారికి భక్తితో పాటు ఆహ్లాదాన్ని అందించే అనేక ఆధ్యాత్మక, ఆహ్లాదకరమైన ప్రదేశాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం కార్తీకమాసం ప్రారంభం కావడంతో పర్యాటకులు దైవ దర్శనాలతోపాటు పిక్నిక్‌లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలతోపాటు ఆధ్యాత్మక దేవాలయాలపై ఒక లుక్కేద్దాం. 

పశ్చిమ ఏజెన్సీలోని అటవీ అందాలు 
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అడవి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. జాలువారుతున్న జలపాతాలు, కొండలను తాకే మేఘాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు మనసును దోచుకుంటాయి. ఏజెన్సీ ప్రాంతంలో జలపాతాలు చూపరుల మదిని దోచుకుంటాయి. జల్లేరు జలాశయం, ముంజులూరులోని ఏనుగుతోగు జలపాతం, గుబ్బల మంగమ్మ సన్నిధి, పోగొండ రిజర్వాయర్‌తో పాటు అటవీప్రాంతంలోని పలు ప్రదేశాలు పిక్నిక్‌ స్పాట్‌లుగా ఉన్నాయి. ప్రతీ ఏటా కార్తీకమాసంలో లక్షలాది మంది పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో వన¿ోజనాలను ఏర్పాటు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు.  

ఆహ్లాదకరం గోదావరి విహారం 
కార్తీకమాసం వచ్చిందంటే పాపికొండల యాత్రకు వెళ్ళేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. గోదావరి తీర ప్రాంతాలతో పాటు పాపికొండల విహారానికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి యాత్రికుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ ఏడాది అత్యధిక వర్షాలు కురిసి గోదావరి వరద కూడా ఉధృతంగా ప్రవహించడంతో బోటు ప్రయాణాలను పర్యాటక శాఖ నిలిపివేసింది. గోదావరి తగ్గుముఖం పట్టడంతో పాటు కార్తీకమాసం ప్రారంభం కావడంతో పర్యాటక శాఖ తిరిగి పాపికొండల విహార యాత్రకు సన్నాహాలు చేస్తోంది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఘాట్‌ నుంచి పాపికొండల విహారయాత్రకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.  

పాపికొండల యాత్రలో సందర్శన స్థలాలు 
పాపికొండల విహారయాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. పట్టిసీమ వీరభద్రస్వామి, మహానందీశ్వర స్వామి ఆలయాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మగుడి, బ్రిటిష్‌ కాలపు పోలీస్‌ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కాటేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమం చూడొచ్చు. గోదావరి వెంట ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులను కనువిందు చేస్తాయి. పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకుల మనస్సును దోచుకుంటుంది.  

గుంటుపల్లి గుహలు 
మనసుకు ఆహ్లాదం, ఉత్తేజం కలిగించే కామవరపుకోట మండలంలోని గుంటుపల్లి(జీలకర్రగూడెం) బౌద్ధాలయాల్ని ఈ కార్తీక మాసంలో అత్యధికమంది దర్శించుకుంటారు. ఈ గుహలో ఉన్న భారీ లింగాకారాన్ని ధర్మలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. ప్రత్యేకంగా కార్తీక సోమవారాల్లో వేలాది మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తారు. ధర్మలింగేశ్వర స్వామి పాలరాతి స్తూపాలను భక్తులు కార్తీక సోమవారాల్లో ఎక్కువగా దర్శించుకుంటారు.  

జిల్లాలో పలు ఆధ్యాత్మక క్షేత్రాలు 
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక పర్యాటక ఆధ్యాత్మక ప్రదేశాలు ఉన్నాయి. నర్సాపురం సమీపంలోని పేరుపాలెం బీచ్‌ కార్తీకమాసంలో పర్యాటకులతో నిండిపోతుంది. సముద్ర స్నానానికి అనుకూలంగా ఉంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు బీచ్‌కు చేరుకుని సందడి చేస్తారు. ఈ సముద్రం వెంట పచ్చని కొబ్బరిచెట్లు, సర్వే చెట్లు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వాటికింద సేదతీరుతుంటారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం సమీపంలోని మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యాటకులు పిక్నిక్‌లు ఏర్పాటు చేసుకుని సందడి చేస్తారు. పంచారామ క్షేత్రాల్లో భీమవరంలోని గునుపూడి ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి, పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. కార్తీక మాసంలో భక్తులు వేలాదిమంది ఈ క్షేత్రాల్ని దర్శించుకుంటారు.  

అందాల నిలయం కొల్లేరు సరస్సు  
పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సు అందాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్తీకమాసంలో వన సమారాధన ఏర్పాటు చేసుకునేలా పర్యాటకులు సన్నాహాలు చేసుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు