AP: పుష్కలంగా ప్రాణవాయువు

10 Jan, 2022 04:18 IST|Sakshi

సాక్షి, అమరావతి:  కరోనా రెండో దశలో ఆక్సిజన్‌ కొరత కారణంగా రాష్ట్రంలో ఎదురైన ఇబ్బందులు తిరిగి కోవిడ్‌ మూడో దశలో తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాణవాయువుకు కొరతలేకుండా ఉండేలా ‘జగనన్న ప్రాణవాయువు’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 50, అంతకన్నా ఎక్కువ పడకలున్న ప్రతి ప్రభుత్వాసుపత్రిలో గాలి నుంచి మెడికల్‌ ఆక్సిజన్‌ తయారుచేసే ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్పషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటుచేసింది. ఈ ప్లాంట్లను సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. 

124 ఆసుపత్రుల్లో 144 ప్లాంట్లు 
రాష్ట్రవ్యాప్తంగా 124 సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల్లో 144 పీఎస్‌ఏ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం రూ.189.5 కోట్లు వెచ్చించింది. ఇవి నిమిషానికి 500, వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 124 ఆస్పత్రుల్లో నిమిషానికి 93,600 లీటర్ల (లీటర్స్‌ పర్‌ మినిట్‌–ఎల్‌పీఎం) ఆక్సిజన్‌ ఉత్పత్తి అవ్వనుంది. మరోవైపు.. పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కరోనా మూడో దశ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఆ వివరాలు.. 

► రూ.90.07 కోట్లతో 24,419 పడకలకు ఆక్సిజన్‌ పైప్‌లైన్ల ఏర్పాటు.  
► 35 ఆసుపత్రుల్లో రూ.15 కోట్లతో 399 కిలోలీటర్ల సామర్థ్యంతో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) ట్యాంకర్ల ఏర్పాటు.  
► మరో 39 ఆస్పత్రుల్లో రూ.16.3 కోట్లతో 390 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఎల్‌ఎంఓ ట్యాంకర్లను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం. 
► ఆక్సిజన్‌ సరఫరా, నిల్వ చేయడానికి 20 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన 25 కంటైనర్లు రూ.15.25కోట్లతో కొనుగోలు.  
► 23,971 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 26,746 డీ టైప్‌ సిలిండర్ల కొనుగోలు.  
► రూ.6.22 కోట్లతో 13 జిల్లాల్లో 20 వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ల ఏర్పాటు.  
► రూ.21.93 కోట్లతో సివిల్, ఎలక్ట్రికల్‌ పనులు నిర్వహణ.  
► రూ.297.36 కోట్లతో మెడికల్, ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్, కోవిడ్‌ కిట్స్‌ కొనుగోలు.  

అన్ని వసతులూ సమకూర్చాం 
కరోనా మూడో దశ వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు సమకూర్చాం. కరోనా చికిత్సకు అవసరమైన ఎనిమిది రకాల మందుల స్టాక్‌ సరిపడా ఉంది. నేడు పీఎస్‌ఏ ప్లాంట్లను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.   
– మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీ వీసీ, ఎండీ 

మరిన్ని వార్తలు