సీఎం విజన్‌తో రైతులకు మేలు

15 Aug, 2020 04:28 IST|Sakshi
వివేక్‌ అగర్వాల్‌

వ్యవసాయంపై మీ దూరదృష్టి భేష్‌

పీఎం కిసాన్‌ సీఈవో, ఏఐఎఫ్‌ మిషన్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగర్వాల్‌

ఏపీకి అన్ని రకాలుగా సహకరిస్తామని వెల్లడి

సాక్షి, అమరావతి:  వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌ ఎంతో బాగుందని ప్రధానమంత్రి (పీఎం) కిసాన్‌ సీఈవో, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్‌) మిషన్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగర్వాల్‌ అభినందించారు. రైతులకు సబ్సిడీలు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించడం చాలా ముఖ్యమని, ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్‌ పలు చర్యలను చేపట్టారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి దార్శనికత అన్నదాతలకు చాలా మేలు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన  ఏఐఎఫ్‌కి సంబంధించిన వివరాలను వివేక్‌ అగర్వాల్‌ తెలియచేశారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి సీఎం జగన్‌  ఆయనకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు తమ లక్ష్యాల సాధనకు ఉపకరిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.   

ప్రతి సమస్యను తీర్చేలా ఆర్బీకేలు: సీఎం జగన్‌     
ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) వాటి పక్కనే ఉంటాయి. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను ఆర్‌బీకేలు పరిష్కరిస్తాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వీటి ద్వారా అందిస్తాం. కియోస్క్‌లో ఆర్డర్‌ చేసిన 48 గంటల్లోగా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నదాతలకు అందుతాయి.  

మరిన్ని వార్తలు