ఎకనమిక్‌ కారిడార్‌కు భూసేకరణ పూర్తిచేయాలి

26 May, 2022 05:29 IST|Sakshi
ప్రధానితో మాట్లాడుతున్న సీఎస్‌ సమీర్‌ శర్మ

కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు ప్రాజెక్టును వేగవంతం చేయాలి 

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌కు సూచించిన ప్రధాని మోదీ 

సాక్షి, అమరావతి: రాయపూర్‌–విశాఖ ఎకనమిక్‌ కారిడార్‌కు భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. ఈ కారిడార్‌తో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రధాని చెప్పారు. అల్యూమినియం, బొగ్గు, బాక్సైట్‌ వంటి విలువైన ఖనిజాలు విశాఖపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతి, దిగుమతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ రాష్ట్రాల సీఎస్‌లు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాయపూర్‌–విశాఖపట్టణం ఎకనమిక్‌ కారిడార్, కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు పైపులైను ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ సమీర్‌శర్మ మాట్లాడుతూ ఎకనమిక్‌ కారిడార్‌ కోసం 798 హెక్టార్లకుగాను 561 హెక్టార్ల భూమిని ఇప్పటికే అప్పగించినట్లు చెప్పారు. రోడ్‌సైడ్‌ ఎమినిటీస్‌కు మరో 50 ఎకరాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన భూసేకరణకు అడ్వాన్స్‌ పొజిషన్‌ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీచేస్తున్నట్లు తెలిపారు. సహజవాయువు పైపులైను ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు మొదటిదశ పూర్తయిందని చెప్పారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు రెండోదశ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు