అన్ని విధాలా సాయం అందిస్తాం

15 Oct, 2020 02:22 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ 

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: భారీ వర్షాల వల్ల ఎదురైన కష్టనష్టాల నుంచి ఆదుకునేందుకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రధాని మోదీ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు భరోసా ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులపై బుధవారం మోదీ.. సీఎం జగన్‌కు ఫోన్‌ చేసి రాష్ట్రంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాలు, నెలకొన్న పరిస్థితులను సీఎం ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. వాయుగుండం తీరం దాటిందని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు.

ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యల గురించి ప్రధానికి వివరించారు. బాధితులను ఆపద నుంచి కాపాడడంలో, వారికి పునరావాస, సహాయక చర్యల్లో అన్ని విధాలా తోడుంటామని ప్రధాని భరోసా ఇచ్చారు. బాధితుల క్షేమాన్ని కాంక్షించారు. కాగా, ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడారు. ఆ రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీసి, ఆదుకుంటామని చెప్పారు.  కాగా, భారీ వర్షాలు, వరద పరిస్థితిపై ఏపీ, తెలంగాణ సీఎంలతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్‌ చేశారు. రెస్క్యూ, రిలీఫ్‌ విషయంలో కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని అందులో పేర్కొన్నారు. 

కేంద్రం అండగా ఉంటుంది
తెలంగాణ, ఏపీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

మరిన్ని వార్తలు