మహిళల ఆర్థిక పరిపుష్టికి జగన్‌ సర్కారు చర్యలు.. రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం

21 Jul, 2022 18:29 IST|Sakshi

 పీఎంఎఫ్‌ఎంఈ కింద పరిశ్రమల ఏర్పాటుకు సహకారం 

 రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం 

10 శాతం లబ్ధిదారు వాటా, 35 శాతం సబ్సిడీ  

కోవిడ్‌ మహమ్మారి ఎంతోమంది మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివిధ రకాల ప«థకాల ద్వారా ఆయా వర్గాలను ఆదుకుంటోంది. అందులో ఒకటి పీఎంఎఫ్‌ఎంఈ పథకం. ఇది ఆహార శుద్ధి రంగానికి సంబంధించినది. ఈ పథకం ద్వారా ఆహార పరిశ్రమలో రాణించాలనుకునే మహిళలకు ప్రభుత్వం   పెద్ద మొత్తంలో సహాయం చేయనుంది. 

అనంతపురం అర్బన్‌: అక్కచెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జగన్‌ సర్కార్‌ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ద్వారా శ్రీకారం చుట్టింది. ఆగస్టు నెలాఖరులోగా 110 యూనిట్లు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి విడతగా 34 యూనిట్ల కోసం డీపీఆర్‌ (డిటైల్‌ ప్రాజెక్ట్‌  రిపోర్ట్‌)ను బ్యాంకులకు పంపింది. ప్రస్తుతం ఉన్న ఆహార శుద్ధి యూనిట్లకు, కొత్త యూనిట్లకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టింది. పరిశ్రమలు నెలకొల్పే సభ్యులకు ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సాంకేతిక సహకారం అందించనుంది.  

ఆర్థిక సాయం ఇలా... 
సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. పెట్టుబడి కింద యూనిట్‌ విలువలో 10 శాతం మొత్తాన్ని లబ్ధిదారు చెల్లించాలి. బ్యాంక్‌ లింకేజీ ద్వారా 90 శాతం రుణం ఇస్తారు. ఇందులో 35 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పటికే ఉన్న యూనిట్లకు సంబంధించి యంత్రాల ఏర్పాటుకు రుణం ఇస్తారు. కొత్తగా యూనిట్‌ ఏర్పాటుకు, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రుణ సౌకర్యం కల్పిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం వర్కింగ్‌ క్యాపిటల్, 75 శాతం మిషనరీకి పెట్టాల్సి ఉంటుంది. 

పథకం ముఖ్య ఉద్దేశం 
► ఆహార శుద్ధి రంగాన్ని సంస్థాగతంగా     బలోపేతం చేయడం 
► సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం 
► పరిశ్రమల సామర్థ్యాల అభివృద్ధి, పనికి     కావాల్సిన సాంకేతిక సహాయం అందించడం 
► ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్‌ తోడ్పాటు 
► సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మౌలిక 
► సదుపాయాలు కల్పించడం 

ఆహారశుద్ధి పరిశ్రమలు 
ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం కింద వేరుశనగ నూనె మిల్లు, దాల్‌ మిల్లు, పిండిమిషన్, బొరుగుల బట్టీ, బేకరీ, రోటీ మేకర్, పచ్చళ్ల తయారీ, శనగల ప్రాసెసింగ్, పొటాటో చిప్స్‌ తయారీ, మురుకులు, మిక్చర్, చెక్కిలాలు, నిప్పట్ల తయారీ తదితర ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. 

మహిళల ఆర్థికాభివృద్ధి సాధన దిశగా.. 
స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద ఆగస్టు నెలాఖరుకు మండలానికి మూడు ఆహార శుద్ధి పరిశ్రమలు, అవసరమున్న చోట ఐదు చొప్పున జిల్లా వ్యాప్తంగా 110 యూనిట్లు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తొలి విడతగా 34 యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌)లను బ్యాంకులకు పంపించాం.  
– ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్‌  

మరిన్ని వార్తలు