పోక్సో కొత్త నిబంధనల ప్రత్యేకతలు 

12 Oct, 2020 19:42 IST|Sakshi

‘పోక్సో’తో బాధితులకు బాసట

చట్ట సవరణతో 18 ఏళ్ల బాలికలకు మరింత రక్షణ

కేంద్రం ఒక అడుగు వేస్తే రాష్ట్రం రెండు అడుగులు

అన్ని విధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వం

తీవ్రమైన లైంగిక దాడి కేసుల్లో మరణశిక్ష

రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌ స్టేషన్లు, 13 దిశ సెంటర్లు

గుంటూరులో ప్రప్రథమంగా ఫ్రెండ్లీ కోర్టు

కర్నూలు జిల్లాకు చెందిన 8వ తరగతి బాలికపై సొంత మేనమామలు ఇద్దరు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ బాలిక ఆరు నెలల గర్భవతి అని తేలింది. పోక్సో చట్టం కింద అన్నదమ్ములు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు ఈ బాలికను తమ సంరక్షణలో ఉంచుకుని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నెలలో ఆమె విజయవాడలోని ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ బాలిక సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడం వల్లే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

సాక్షి, అమరావతి: లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించడానికి పోక్సో (ప్రొటెక‌్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్ ఫ్రమ్‌ సెక్స్‌వల్‌ అఫెన్సెస్‌) చట్టం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వేస్తే రాష్ట్రం రెండడుగులు ముందుకేసింది. చిన్నారులపై పెరిగిపోతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు, అక్రమ రవాణా, నీలి చిత్రాల్లో వాడుకోవడం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పోక్సో చట్టానికి సవరణలు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దోషులకు కఠిన శిక్షలు పడేలా, బాధితులకు అన్ని రకాలుగా న్యాయం జరిగేలా వెన్నంటి ఉంటోంది. ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ చర్యల కారణంగా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయగలుగుతున్నారు. కొత్త చట్టం మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. 

పోక్సో కొత్త నిబంధనల ప్రత్యేకతలు

  • స్కూళ్లు, క్రెష్‌ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బంది గత చరిత్రపై పోలీస్‌ నివేదికలు తెప్పించుకోవాలి. బాధితులకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వాలి.
  • పిల్లలతో పని చేసే సంస్థలు, వ్యక్తులు, పోలీసులు, ఫోరెన్సిక్‌ అధికారులకు శిక్షణ ఇవ్వాలి. తమను తాము రక్షించుకునేలా పిల్లలకు అవగాహన కలిగించాలి.
  • బాధితుల గురించి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు సిఫారసు చేయాలి.
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్షణ ఉచిత వైద్య పరీక్షలు, మానసిక ఆరోగ్యం కోసం కౌన్సెలింగ్‌, ఉచిత న్యాయ సహాయం అందించాలి. బాధితుల చదువుకు ఆటంకం కలగకూడదు. దోషుల నుంచి బెదిరింపులు రాకుండా చర్యలు తీసుకోవాలి.  

రాష్ట్రంలో సంచలన తీర్పు
విజయవాడ రూరల్‌లో ఒక బాలికపై 2017లో అత్యాచారానికి పాల్పడిన నిందితునికి విజయవాడ స్పెషల్‌ కోర్టు విచారణ జరిపి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. రక్షణ కల్పించాల్సిన అధికారులు, సమీప బంధువులు తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడితే దోషులకు ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో విప్లవాత్మక చర్యలు

  • ఈ కేసుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 18 దిశ పోలీస్‌ స్టేషన్లు, ఆస్పత్రుల్లో 13 దిశ సెంటర్లను ఏర్పాటు చేసింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో మరో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది.
  • పోలీసులు ఈ కేసుల సమాచారాన్ని ఐదుగురు సభ్యులుగల చైల్డ్‌ ప్రొటెక‌్షన్‌ కమిటీకి ఇవ్వడంతో వారు పిల్లల సంరక్షణకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
  • గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ కోర్టులో ఈ కేసుల విచారణను ప్రత్యేకంగా చేపడుతున్నారు.
  • కోర్టుల్లో అందరికీ కనపడేలా కాకుండా న్యాయవాది, న్యాయమూర్తి, టైపిస్టులు మినహా ఎవరూ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.  

అన్ని విధాలా ఆదుకుంటున్నాం
అత్యాచారానికి గురైన బాలికల విషయంలో అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. పలు కేసులను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోని రెండు సంఘటనలకు బాధిత బాలికలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించారు. ప్రభుత్వం ఇటువంటి కేసుల్లో బాధితులకు రూ.లక్ష అందజేస్తోంది. దోషులకు కఠిన శిక్షలు పడేలా పోలీస్‌, ఐసీడీఎస్‌ శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. పోక్సో చట్టానికి సవరణల తర్వాత బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. 
- తానేటి వనిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి 

పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం
దోషులపై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సాయం అందిస్తున్నాం. పోక్సో చట్టం అమలు పరిచే అధికారులకు ఆన్‌లైన్‌ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వైద్యులు, న్యాయవాదులు బాధితులతో సున్నితంగా వ్యవహరించేలా అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలల్లోని పిల్లలందరికీ ఈ చట్టం గురించి తెలియజెపుతున్నాం. 
- కృతికా శుక్లా, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ 


 

మరిన్ని వార్తలు