Polavaram: త్యాగధనులకు బహుమానం

3 Jul, 2021 07:45 IST|Sakshi

పోలవరం నిర్వాసిత కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున పరిహారం

ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.6.86 లక్షలు, ఇతరులకు రూ.6.36 లక్షల పరిహారం ఇస్తున్న కేంద్రం

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారాన్ని కలిపి ఇవ్వడానికి చర్యలు 

అదనంగా పరిహారం చెల్లించడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.550 కోట్ల భారం

సాక్షి, అమరావతి: విశాల ప్రయోజనాల కోసం ఉన్న ఊళ్లు, ఇళ్లు, జీవనాధారమైన భూములను కోల్పోతున్న పోలవరం నిర్వాసితుల త్యాగాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహుమానం ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.పది లక్షల చొప్పున పరిహారం అందించాలని జల వనరుల శాఖను ఆదేశించారు. దాంతో తొలి దశలో పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ (రీహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌) కింద కేంద్రం ఇస్తున్న మొత్తానికి అదనపు మొత్తాన్ని జమ చేసి.. ఒక్కో కుటుంబానికి రూ.పది లక్షల వంతున పరిహారం అందించేలా జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.550 కోట్ల మేర అదనపు భారం పడుతుంది.

నిర్వాసిత కుటుంబాలు 1.06 లక్షలు
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏడు మండలాల్లో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయి. ముంపునకు గురయ్యే భూమిని భూసేకరణ చట్టం–2013 ప్రకారం సేకరించి పరిహారం అందించడంతోపాటు నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ కింద పరిహారం అందించాలి. పునరావాస కాలనీల్లో ఇంటిని నిర్మించి ఇవ్వాలి.

పోలవరం నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఎస్సీ, ఎస్టీ నిర్వాసిత కుటుంబాలకు రూ.6.86 లక్షలు, ఇతర కుటుంబాలకు రూ.6.36 లక్షల చొప్పున కేంద్రం పరిహారం అందిస్తోంది. రూ.పది లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పోలవరం నిర్వాసితులు కోరారు. ఇందుకు ఆయన అంగీకరించారు. ఆ హామీని అమలు చేస్తూ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ఇస్తున్న మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు మొత్తాన్ని కలిపి.. రూ.పది లక్షల చొప్పున నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. 

పోలవరంతో ఆహారభద్రత 
పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలు వెరసి 23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అంటే.. కొత్తగా 15.20 లక్షల ఎకరాలకు సాగునీరు.. 23.21 లక్షల ఎకరాల ఆయకట్టును పోలవరం ప్రాజెక్టు ద్వారా స్థిరీకరించవచ్చు. మొత్తమ్మీద 38.41 లక్షల ఎకరాలకు పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లందుతాయి.

ఇంత భారీ ఎత్తున ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టు దేశంలో మరొకటి లేదు. ఆయకట్టులో పండించే పంటల వల్ల ప్రజలకు ఆహార భద్రత చేకూరుతుంది. పోలవరం జల విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా చౌక ధరలకే 960 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రావడం వల్ల ప్రజలపై విద్యుత్‌ భారం కూడా తగ్గుతుంది. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది కాబట్టే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి జీవనాడిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.  

చదవండి: సామరస్య పరిష్కారానికి సీఎం జగన్‌ యత్నం

మరిన్ని వార్తలు