పోలవరం తొలిదశతో 2.98 లక్షల ఎకరాలకు సాగునీరు

7 Sep, 2022 03:59 IST|Sakshi

తొలి దశ పనుల పూర్తికి రూ.10,911 కోట్లు అవసరం

విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు నీటి సరఫరా

రెండో దశలో 4.02 లక్షల ఎకరాలకు సాగునీరు 

ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో 8 లక్షల ఎకరాలకు నీరు 

నివేదిక ఇవ్వాలని పీపీఏను ఆదేశించిన సీడబ్ల్యూసీ సభ్యుడు వోహ్రా 

సాక్షి, అమరావతి: పోలవరం తొలి దశ పూర్తైతే కుడి కాలువ కింద 1.57 లక్షల ఎకరాలు(తాడిపూడి ఎత్తిపోతల ఆయకట్టు), ఎడమ కాలువ కింద 1.14 లక్షల (పుష్కర ఎత్తిపోతల) ఎకరాలతో కలిపి మొత్తం 2.98 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వాటర్‌ ప్లానింగ్, పాజెక్టుల విభాగం సభ్యుడు కె.వోహ్రాకు ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు వివరించారు. గోదావరి డెల్టాలో 10.13 లక్షలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షలు వెరసి రూ.23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చన్నారు.

విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చవచ్చన్నారు. తొలి దశ పనులు పూర్తి చేయడానికి రూ.10,911 కోట్లు అవసరమని తెలిపారు. దీంతో ఏకీభవించిన వోహ్రా.. తొలి దశ పనుల పూర్తికి అవసరమైన నిధుల మంజూరుకు నివేదిక ఇవ్వాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి ఎం.రఘురాంను ఆదేశించారు.

పోలవరం  సవరించిన అంచనా వ్యయం రూ.55,587.87 కోట్లను ఆమోదించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రూ.పది వేల కోట్లను అడ్‌హక్‌గా ఇవ్వాలని ఇటీవల ప్రధాని మోదీని సీఎం వైఎస్‌ జగన్‌ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని ఆదేశాల మేరకు పోలవరంతోపాటు సీఎం జగన్‌ ప్రస్తావించిన ఇతర అంశాల పరిష్కారంపై పీఎంవో నియమించిన కేంద్ర కమిటీ గత నెల 25న ఢిల్లీలో రాష్ట్ర అధికారుల కమిటీతో సమావేశమైంది.

ఈ సమావేశంలో పోలవరానికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లను మంజూరు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర కమిటీ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కె.వోహ్రా మంగళవారం వర్చువల్‌ విధానంలో పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, సహాయ పునరావాస విభాగం కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ తదితరులతో సమావేశమయ్యారు. 

రెండోదశలో...
పోలవరం రెండో దశ పూర్తైతే ఆయకట్టులో మిగిలిన 4.02 లక్షల ఎకరాలతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని, ఇందుకు మరో రూ.21 వేల కోట్లకుపైగా అవసరమని పోలవరం సీఈ సుధాకర్‌బాబు తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ప్రభావం పోలవరం తొలిదశపై ఏమాత్రం ఉండదని వోహ్రాకు వివరించారు.

పోలవరం పూర్తయితే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతలతోపాటు పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాలను మూసేస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల వరద జలాలపై ఆధారపడి చేపట్టామని చెప్పారు. వెంకటనగరం పంపింగ్‌ స్కీం ఆయకట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. దీంతో పోలవరం తొలి దశ పూర్తికి నిధులపై నివేదిక పంపాలని పీపీఏ సభ్య కార్యదర్శిని వోహ్రా ఆదేశించారు. పీపీఏ నివేదిక ఆధారంగా కేంద్ర జల్‌ శక్తి శాఖకు నిధులు మంజూరు చేయాలని సిఫార్సు చేస్తామని చెప్పారు.   

మరిన్ని వార్తలు