జర్మనీ టు పోలవరం

4 Feb, 2021 05:45 IST|Sakshi
జర్మనీ నుంచి పోలవరానికి చేరిన భారీ హైడ్రాలిక్‌ సిలెండర్లు

ప్రపంచంలో అతిపెద్ద హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను అమర్చుతున్న ప్రాజెక్టు పోలవరమే

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే క్రస్ట్‌ గేట్ల నిర్వహణలో అత్యంత కీలకమైన ‘హైడ్రాలిక్‌ హాయిస్ట్‌’ సిలిండర్లను జర్మనీలోని మాంట్‌ హైడ్రాలిక్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం తయారుచేయించి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే 70 సిలిండర్లు జర్మనీ నుంచి ప్రత్యేక నౌక ద్వారా విశాఖపట్నం నౌకాశ్రయానికి.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేర్చారు. మిగిలిన 26 సిలిండర్లను యుద్ధప్రాతిపదికన దిగుమతి చేసుకునేందుకు సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రపంచంలో హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లతో అతిపెద్ద గేట్లను అమర్చుతున్న ప్రాజెక్టు పోలవరమే కావడం గమనార్హం. 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. గోదావరికి వరద వచ్చేలోగా స్పిల్‌ వేను, కాఫర్‌ డ్యామ్‌లను పూర్తిచేయాలని నిర్ణయించింది. తద్వారా వరదల సమయంలోనూ కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన నిర్విఘ్నంగా పనులను చేపట్టడం ద్వారా ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌)ను పూర్తిచేయాలన్నది సర్కారు ప్రణాళిక. దాంతో స్పిల్‌ వే పనులను ముమ్మరం చేసింది.

శరవేగంగా స్పిల్‌ వేకు గేట్లు
ఇక గోదావరి నది చరిత్రలో ధవళేశ్వరం బ్యారేజీలోకి ఆగస్టు 16, 1986న గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. జలాశయం భద్రత దృష్ట్యా 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా సులభంగా దిగువకు వదిలేలా పోలవరం స్పిల్‌ వేను నిర్మించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల మేరకు 1,128.40 మీటర్ల పొడవున 55 మీటర్ల ఎత్తుతో స్పిల్‌ వేను నిర్మిస్తున్నారు. స్పిల్‌ వేకు 20 మీటర్ల ఎత్తు.. 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను బిగించే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 26 గేట్లను అమర్చిచింది. మరో 22 గేట్లను అమర్చే పనులను వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. ఈ గేటును కిందకీ.. పైకి ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు 200 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల రెండు హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను చెరో వైపున అమర్చడంతో గేటు బిగింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే 70 సిలిండర్లను ఆ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ సిలిండర్లను 35 గేట్లకు అమర్చేలోగా.. మిగిలిన 26 సిలిండర్లు పోలవరానికి చేరుకోనున్నాయి. వాటిని మిగిలిన 13 గేట్లకు అమర్చుతారు. దాంతో స్పిల్‌ వే పనులు పూర్తవుతాయి. ఈ పనులను మే నాటికి పూర్తి చేసే దిశగా  వేగవంతం చేశారు. 

మరిన్ని వార్తలు