2025 జూన్‌కు పోలవరం పూర్తి

2 Jun, 2023 04:06 IST|Sakshi

అప్పటికి ఆయకట్టుకు నీరందించాలి.. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి

ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించిన రాష్ట్ర అధికారులు

తొలి దశ నీటి నిల్వ, ఆయకట్టుకు నీరివ్వడానికి రూ.17,144 కోట్లు అవసరమని వెల్లడి

45.72 మీటర్ల స్థాయికి పూర్తి చేయాలంటే రూ. 55,548.87 కోట్లు అవసరమని స్పష్టీకరణ..

నిర్వాసితుల పునరావాసం బాధ్యత కేంద్రానిదేనన్న మంత్రి

తొలి దశ నిధులపై నివేదిక ఇవ్వాలని ఆదేశం.. ఆ నివేదికకు మంత్రి మండలి ఆమోదం తీసుకుంటామని వెల్లడి

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, 2025 జూన్‌కు ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించి, రైతులకు ఫలాలను అందించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ కుశ్వీందర్‌సింగ్‌ వోరా, సలహాదారు వెదిరె శ్రీరాంలతో కలిసి మంత్రి షెకావత్‌ సమీక్షించారు.

రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి (ఇన్‌చార్జి) శ్యామ­ల­రావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర మంత్రి షెకావత్‌కు ఈఎన్‌సీ నారాయణరెడ్డి వివరించారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేసి 2021 జూన్‌ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించామని చెప్పారు.

ప్రధాన డ్యామ్‌ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో పూడ్చి, వైబ్రో కాంపాక్షన్‌ ద్వారా యధాస్థితికి తెస్తున్నామన్నారు. మళ్లీ వరదలు వచ్చేలోగా ఈ పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌లో దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఈలోగా గ్యాప్‌–1లో ప్రధాన డ్యామ్‌ పనులు చేపడతామన్నారు. గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేశాక ప్రధాన డ్యామ్‌ పనులు చేపట్టి గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు.

ఆలోగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న చోట్ల కొత్తగా నిర్మించే వాల్‌ డిజైన్‌ను తక్షణమే ఖరారు చేయాలని సీడబ్ల్యూసీని కేంద్ర మంత్రి ఆదేశించారు. ప్రధాన డ్యామ్‌ ప్రాంతంలో రోజుకు 50 వేల క్యూబిక్‌ మీటర్ల స్థానంలో లక్ష క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుకను పూడ్చి, వైబ్రోకాంపాక్షన్‌ చేసేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

దశలవారీగా నీటి నిల్వ
ప్రాజెక్టులో మూడు దశల్లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని ఈఎన్‌సీ చెప్పారు. తొలి ఏడాది 41.15 మీటర్ల స్థాయిలో నిల్వ చేస్తామన్నారు. ఈ స్థాయిలో తొలుత 123 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 20,946 కుటుంబాల్లో  ఇప్పటికే 12,060 కుటుంబాలకు పునరావాసం కల్పించామని వివరించారు. గతేడాది నిర్వహించిన లైడార్‌ సర్వేలో మరో 36 గ్రామాలు 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి వస్తాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 16,642 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు.

ఈ గ్రామాలు 45.72 మీటర్ల పరిధిలోకే వస్తాయని వివరించారు. ప్రాజెక్టు పూర్తయ్యాక రెండో, మూడో ఏడాది 45.72 మీటర్ల పరిధిలోని మొత్తం 1,00,006 కుటుంబాలకు పునవాసం కల్పించి.. గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్‌ స్పందిస్తూ.. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునవాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

తొలి దశ పూర్తికి రూ.17,144 కోట్లు
ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకు పూర్తి చేసి, తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసి.. ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలంటే రూ.17,144 కోట్లు అవసరమని జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి వివరించారు. సమగ్రంగా 45.72 మీటర్ల స్థాయికి పూర్తి చేయడానికి 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లు వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ తేల్చిందని, ఆ మేరకు నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్‌ స్పందిస్తూ.. తొలి దశ పూర్తికి రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనను పరిశీలించి, నిధులు ఎంత అవసరమో నివేదిక ఇవ్వాలని పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులను ఆదేశించారు.

ఆ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదం తీసుకోవడం ద్వారా పోలవరానికి నిధుల సమస్య లేకుండా చేస్తామని, తద్వారా షెడ్యూలులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరిస్తామని చెప్పారు. బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల ముంపు సమస్యపై సంయుక్త అధ్యయనానికి ఒడిశా సహాయ నిరాకరణ చేయడంపై తాము చర్చిస్తామని మంత్రి షెకావత్‌ చెప్పారు.

అనుమతి లేని ప్రాజెక్టులపై గోదావరి బోర్డులో చర్చ
పట్టిసీమ, పురుషోత్తపట్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు అనుమతి లేకుండా చేపట్టారని, వాటి డీపీఆర్‌లు పంపి, ఆమోదం తీసుకోవాలని రాష్ట అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీనిపై రాష్ట్ర అధికారులు స్పందిస్తూ... తెలంగాణ కూడా అనుమతి లేకుండా కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతమ్మసాగర్‌ తదితర ప్రాజెక్టులను చేపట్టిందని, ఈ విషయాన్ని గోదావరి బోర్డు, కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని గుర్తు చేశారు.

పట్టిసీమ, పురుషోత్తపట్నం తాత్కాలికమైనవేనని, పోలవరం పూర్తయితే ఆ రెండు ఎత్తిపోతలను మూసేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టామన్నారు. అప్పట్లోనే భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. దాంతో.. అనుమతి లేని ప్రాజెక్టులపై అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చిస్తామని కేంద్ర మంత్రి షెకావత్‌ స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు