కీలక డిజైన్‌ల ఆమోదానికి కసరత్తు

17 Jan, 2021 05:43 IST|Sakshi

గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తికి అడుగులు

రేపు పుణెకు పీపీఏ అధికారుల బృందం.. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనంపై పరిశీలన

వచ్చే వారంలో పోలవరం ప్రాజెక్టు వద్ద డీడీఆర్‌పీ సమావేశం

పెండింగ్‌లోని 30 డిజైన్‌లకు ఆమోదముద్రకు యత్నాలు

సాక్షి, అమరావతి: గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ (జలాశయం) నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 30 డిజైన్లను సీడబ్ల్యూసీతో వేగంగా ఆమోదింపజేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. వరద నీటిని స్పిల్‌వే మీదుగా మళ్లించడానికి నదిలో తవ్వే అప్రోచ్‌ చానల్‌ ఎడమ గట్టుపై నిర్మించే గైడ్‌ బండ్‌ డిజైన్‌ను పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) అధ్యయనం చేస్తోంది. ఎకరం విస్తీర్ణంలో 3–డీ నమూనాలో పోలవరం ప్రాజెక్టును నిర్మించి ఆ డిజైన్‌పై అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనాన్ని పరిశీలించి, సీడబ్ల్యూసీకి ఆ డిజైన్‌ను పంపేందుకు సోమవారం పీపీఏ అధికారుల బృందం పుణెకు వెళుతోంది.

వచ్చే వారంలో పోలవరం ప్రాజెక్టు వద్దే డీడీఆర్‌పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) సమావేశాన్ని నిర్వహించి, కాంట్రాక్టర్‌ (ఏజెన్సీ), రాష్ట్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న డిజైన్‌లపై ఆమోదముద్ర వేయించుకుని.. వాటిని సీడబ్ల్యూసీకి పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలోగా పెండింగ్‌ డిజైన్‌లను ఆమోదింపజేసుకోవడం ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పోలవరం ప్రాజెక్టు పనులను గత నెల 14న క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పెండింగ్‌లో ఉన్న డిజైన్‌లను ఫిబ్రవరిలోగా ఆమోదింపజేసుకుని, 2022 ఖరీఫ్‌ నాటికి ఆయకట్టుకు నీళ్లందించేలా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.

వరద వచ్చేలోగా స్పిల్‌ వే, కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి..
గోదావరికి జూన్‌ రెండో వారం నుంచే వరద ప్రారంభమవుతుంది. ఆలోగా స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయాలి. అప్పుడే గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించడం ద్వారా ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) పనులను గడవులోగా పూర్తి చేయవచ్చు. ఈ నేపథ్యంలో స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, కాఫర్‌ డ్యామ్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న డిజైన్‌లను యుద్ధప్రాతిపదికన ఆమోదింజేసుకోవడంపై పీపీఏ, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ప్రాజెక్టు కీలక డిజైన్‌లపై సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనం ఆధారంగా ఆ డిజైన్‌లలో మార్పులు చేర్పులు చేసి.. సీడబ్ల్యూసీ రిటైర్డు చైర్మన్‌ ఏబీ పాండ్య నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన డీడీఆర్‌పీకి పంపుతారు. డీడీఆర్‌పీ ఓకే చెప్పిన డిజైన్‌లను సీడబ్ల్యూసీ ఆమోదిస్తుంది. జలాశయం పనులకు సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న 30 డిజైన్‌లను ఇదే విధానంలో ఆమోదింపజేసుకోవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు