సైబర్‌ వల.. కేవైసీ అప్డేట్‌ అంటూ..

24 Aug, 2020 09:37 IST|Sakshi

 అకౌంట్లు కొల్లగొడుతున్న నేరగాళ్లు 

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు  

గుంటూరు నగరానికి చెందిన రవికి గత నెలలో ఓ నంబర్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. ‘మీ కేవైసీ  సమాచారం అప్‌డేట్‌ చేసుకోండి’ అంటూ అందులో ఉంది. వివరాల కోసం ఫోన్‌ చేయమని మెసేజ్‌లో సూచించిన నంబర్‌కు రవి ఫోన్‌ చేశాడు.  లిఫ్ట్‌ చేసిన వ్యక్తి  పేటీఎం యాప్‌ వివరాలు అడిగాడు. అవతలి వ్యక్తి అడిగిన వివరాలన్నింటినీ  చెప్పాడు. చివరగా వివరాలు అప్‌డేట్‌ చేయడానికి ‘ఎనీ డెస్క్‌ యాప్‌’ను డౌన్‌ లోడ్‌ చేసి, రూ.10 బదిలీ చేయమని సూచించడంతో ఆ పనిని కూడా పూర్తి చేశాడు.  అరగంట అనంతరం రవి ఖాతా నుంచి రూ.45 వేలు బదిలీ చేసినట్టు అలర్ట్‌ వచ్చింది. దీంతో మోసపోయానని గుర్తించి  పోలీసులను ఆశ్రయించాడు.

సాక్షి, గుంటూరు: మీ బ్యాంకు ఖాతా, డెబిట్‌ కార్డు, కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) వివరాలు అసంపూర్తిగా ఉన్నాయంటారు.. వెంటనే అప్‌డేట్‌ చేయాలని లేకపోతే ఖాతా, కార్డు బ్లాక్‌ అవుతుందని హెచ్చరిస్తారు. కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులుగా నమ్మించి వివరాలన్నీ అడిగి  తెలుసుకుంటారు. అనంతరం ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి అందులో అన్ని వివరాలు అప్‌డేట్‌ చేయమంటూ ఆ కస్టమర్లను బురిడీ కొట్టించి ఖాతా వివరాలు, యూపీఐ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ రహస్య నంబర్‌ తెలుసుకుని క్షణాల్లో ఖాతా నుంచి డబ్బు మాయం చేస్తారు. కంటికి కనిపించకుండా ఖాతాల్లో నగదు కొల్లగొట్టడానికి సైబర్‌  నేరగాళ్లు ఎంచుకున్న మార్గం కేవైసీ అప్‌డేట్‌ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.   

యాప్‌ల లింక్‌తో సొమ్ము స్వాహా... 
కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయడం కోసం ఎనీ డెస్క్, టీం వ్యూయర్‌ వంటి యాప్‌లు డౌన్‌ లోడ్‌ చేయడం కోసం పంపే లింక్‌ ద్వారా మన ఫోన్, ల్యాప్‌ట్యాప్,  కంప్యూటర్‌లు సైబర్‌ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతాయి. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసిన అనంతరం  ఒక రూపాయి, రూ.10, రూ.100 ఇలా ఎంతో కొంత బదిలీ చేయమని సూచించి ఆ సమయంలో యూపీఐ, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్, యూజర్‌నేమ్‌ వంటి వివరాలను పసిగట్టి ఖాతాలు ఖాళీ చేస్తారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
కేవైసీ అప్‌డేట్‌తో సైబర్‌ నేరగాళ్లు వేసే వలలో పడకుండా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
కేవైసీ అప్‌డేట్‌ల రూపంలో వచ్చే మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు  స్పందించవద్దు.
కస్టమర్‌ కేర్‌ ప్రతినిధుల మంటూ గుర్తుతెలియని వ్యక్తులు సూచించే యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. వాళ్లు సూచించినట్టు తనిఖీ కోసమని  నగదు బదిలీ చేయవద్దు.
పరిజ్ఞానం యాప్‌లు, అప్లికేషన్‌ల జోలికి వెళ్లొద్దు. కేవైసీ అప్‌డేట్‌ అంటూ సెల్‌కు వచ్చే అలర్ట్‌లలోని లింక్‌లపై క్లిక్‌ చేయవద్దు.  

వెంటనే పోలీసులను సంప్రదించండి 
మీకు తెలియకుండా ఖాతాల నుంచి నగదు బదిలీ అయిన వెంటనే పోలీసులను సంప్రదించండి. సంబంధిత ఖాతా కలిగిన బ్యాంక్‌లో సంప్రదించి ఖాతా నుంచి మీకు తెలియకుండా నగదు బదిలీ అవుతున్న విషయాన్ని తెలియజేయండి. అపరిచితులకు మీ బ్యాంక్‌ ఖాతా, యూపీఐ, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయకండి.
– ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి, అర్బన్‌ జిల్లా ఎస్పీ 

ఎవరూ ఫోన్‌లు, మెసేజ్‌లు చేయరు..  
కేవైసీ అప్‌డేట్‌ చేసుకోమని బ్యాంక్, పేమెంట్‌ యాప్‌ల ప్రతినిధులు ఎవరూ ఫోన్‌లు, మెసేజ్‌లు చేయరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కేవైసీ అప్‌డేట్‌ పేరుతో మీకు ఫోన్, మెసేజ్‌  వస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. వాళ్లు సూచించే విధంగా స్పందించకండి. 
– విశాల్‌ గున్నీ, రూరల్‌ జిల్లా ఎస్పీ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా