అయ్యో.. మొబైల్‌ పోయిందా? ఇలా చేయండి

9 Jul, 2022 10:14 IST|Sakshi

8977945606కి ఫిర్యాదుచేయండి 

ప్రత్యేక సైబర్‌ సెల్‌ ఏర్పాటు  

ట్రాక్‌ చేసి చర్యలు తీసుకుంటాం: ఎస్పీ ఎం.దీపిక

విజయనగరం క్రైమ్‌: ఎంతో విలువైన మొబైల్‌ మిస్సయిందా?  కంగారు పడకండి. పోలీస్‌ స్టేషన్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.  జిల్లా పోలీస్‌శాఖ నూతనంగా రూపకల్పన చేసి నిరంతర పర్యవేక్షణకు సైబర్‌ సెల్‌ను ఏర్పాటుచేసింది.  మొబైల్‌ పోగొట్టుకున్న వ్యక్తులు ఇటీవలికాలంలో పెరుగుతుండడంతో, బాధితులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకండా, ఫిర్యాదుల స్వీకరణను సులభతరం చేస్తూ  ఎస్పీ ఎం.దీపిక  చర్యలు చేపట్టారు.

మొబైల్‌ పొగొట్టుకున్న బాధిత ఫిర్యాదు దారు పేరు, చిరునామా, సంప్రదించాల్సిన మొబైల్‌ నంబర్, మొబైల్‌ మోడల్, ఐఎంఈఐ నంర్, ఫోన్‌ పోయిన తేదీ, సమయం, ప్రాంతం వంటి వివరాలను  పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌  8977945606కు పంపించాలి. ఫిర్యాదు అందుకున్న వెంటనే సైబర్‌సెల్‌ పోలీసులు  బాధిత ఫోన్‌ను ట్రాక్‌ చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చర్యలు చేపడతారు.   పోగొట్టుకున్న ఫోన్‌లను ట్రాక్‌ చేసి తర్వాత  తిరిగి బాధితులకు అందజేస్తారు.  ఒకవేళ పోయిన ఫోన్‌లు ట్రాక్‌ కాకుంటే చట్టపరమైన చర్యలు చేపట్టి, దర్యాప్తు చేస్తారు.  వాట్సాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సైబర్‌ సెల్‌ సిబ్బంది స్వీకరించి, వాటిని రిజిస్టర్‌లో నమోదుచేసి, పోయిన మొబైల్స్‌ను కనుగొనేందుకు చర్యలు చేపడతారు.

ఆందోళన అవసరం లేదు 
జిల్లాలో మొబైల్స్‌ పోగొట్టుకున్న  ప్రజలెవరూ  ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  జస్ట్‌  డయల్‌ 8977945606కు చేసి ఫిర్యాదు చేస్తే సైబర్‌ సెల్‌ నిరంతర పర్యవేక్షణ చేస్తుంది.  పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోలీస్‌ శాఖ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  
– ఎం.దీపిక, ఎస్‌పి, విజయనగరం  

   

మరిన్ని వార్తలు