ప్లాస్మా దానం చేసిన కానిస్టేబుల్‌

31 Jul, 2020 12:53 IST|Sakshi
ప్లాస్మా దానం చేసిన కానిస్టేబుల్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేసిన ఎస్పీ ఫక్కీరప్ప

అభినందించి సత్కరించిన ఎస్పీ 

కర్నూలు: కరోనా బారిన పడి కోలుకున్న కానిస్టేబుల్‌ పరమేశ్వరుడు గురువారం ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా దానం చేశారు. ఈయన ప్యాపిలి పోలీసు స్టేషన్‌లో మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. జూలై 6న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా నుంచి కోల్కొని డిశ్చార్జ్‌ అయ్యి జూలై 15 నుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. ఎస్పీ ఫక్కీరప్ప పిలుపు మేరకు కానిస్టేబుల్‌ పరమేశ్వరుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వాసుపత్రిలో టెస్టింగ్‌ చేయించుకుని కరోనా నెగిటివ్‌ రావడంతో ప్లాస్మా దానం చేశారు.

ఈ సందర్భంగా పరమేశ్వరుడును ఎస్పీ ఫక్కీరప్ప తన కార్యాలయానికి పిలిపించి శాలువా కప్పి సన్మానించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కరోనా నుంచి కోల్కొని ప్లాస్మా దానం చేసిన పరమేశ్వరుడు పలువురికి ఆదర్శమని కొనియాడారు. కరోనా నుంచి కోల్కొన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ గౌతమిసాలి, నాన్‌ కేడర్‌ ఎస్పీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు