టార్చ్‌ వెలుగులో వెళ్లి ప్రాణం పోశాడు 

8 Dec, 2020 11:39 IST|Sakshi
కాలువలో పడిన వ్యక్తిని వెలుపలకు తీసుకొస్తున్న దృశ్యం.. ఇన్‌సెట్‌లో కానిస్టేబుల్‌ శ్రీనివాసులు 

మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్‌ 

సాక్షి, ఆత్మకూరు: ఓవైపు వర్షం, మరోవైపు చీకటి. ఆ స్థితిలో ఓ వ్యక్తి బైపాస్‌రోడ్డులో బురదలో పడి ఉన్నాడు. దారిన వెళ్లేవారు కూడా పట్టించుకోని పరిస్థితి. ఆత్మకూరు బైపాస్‌రోడ్డు శివార్లలో నూతనంగా ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. ఆదివా రం రాత్రి అపార్ట్‌మెంట్‌ ఎదురుగా కాలువలో ఓ వ్యక్తి పడిపోయి ఒళ్లంతా బురదమయమై బాధతో మూలుగుతున్నాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి 100కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన జిల్లా పోలీసులు ఆత్మకూరు పోలీసులకు సమాచారం తెలిపారు. ఎస్సై సి.సంతోష్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు కానిస్టేబుల్‌ కె.శ్రీనివాసులు రాత్రి 11.30 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాలువలో పడిపోయిన వ్యక్తిని గుర్తించారు.  చదవండి: (నెల రోజుల్లో వివాహం.. అర్ధరాత్రి దారుణహత్య)

108కి ఫోన్‌ చేయగా పట్టణంతోపాటు సమీపంలోని మూడు మండలాల వాహనాలు అందుబాటులో లేకపోవడంతో కానిస్టేబుల్‌ శ్రీనివాసులు బాధితుడిని గుర్తించేందుకు టార్చ్‌ వెలుగులో ప్రయత్నించారు. బాధితుడు వెంకట్రావుపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించి, వర్షంలోనే బాధితుడి ఇంటికి వెళ్లి సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆ యువకుడిని బయటకు తెచ్చారు. మద్యం మత్తులో పడిపోయాడనే అను మానం వ్యక్తం చేసినా, మూర్ఛతో పడిపోయినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. ఎట్టకేలకు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందించారు. తీవ్ర వర్షంలోనూ మానవత్వంతో స్పందించిన కానిస్టేబుల్‌ శ్రీనివాసులును పలువురు అభినందించారు.  చదవండి:  (కన్నా..నీ వెంటే మేమంతా..!)

మరిన్ని వార్తలు