విగ్రహ ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు

22 Jan, 2021 18:31 IST|Sakshi

విజయవాడ​: కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కాపేట గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలోని నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. గతేడాది సెప్టెంబరు 17న విశ్వేశ్వర ఆలయంలో జరిగిన ఘటనలో దుండగులు నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను ప్రధాన ముద్దాయిగా గుర్తించారు. శ్రీనివాస్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 
 
వజ్రాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే నిందితులు నంది విగ్రహ చెవులను విరగొట్టారని ఆయన వెల్లడించారు. నంది విగ్రహం నడుము భాగంలో హంస ఉంటే వజ్రాలు ఉంటాయని నిందితులు భావించారని, ఈ విషయంపై పూజారి యుగంధర్ శర్మను వివరాలు అడగడంతో ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారని ఎస్పీ తెలిపారు. విగ్రహ ధ్వంసానికి ముందు నిందితులు పలు మార్లు రెక్కీ నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. గుప్త నిధుల వేటలోనే విగ్రహాన్ని పగలగొట్టినట్లు నిందితులు అంగీకరించారని ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. 

నిందితులపై 447, 427, 295, 295A,153, IPC & 20 of Indian treasure trove act 1878 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి Ap 24 AP 8999 ఇన్నోవా కార్, Ap 16 DQ 4243 స్విఫ్ట్ కార్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. విగ్రహాన్ని పగలగొట్టడానికి వినియోగించిన సుత్తి ,గ్యాస్ కట్టర్లను సీస్ చేశామని పేర్కొన్నారు. గుప్తనిధుల వేటలో నిందితులు రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో రెక్కీ నిర్వహించినట్టు గుర్తించామని ఆయన తెలిపారు. వాటికి సంబంధించిన ఫోటోలను నిందితుల సెల్ ఫోన్లలో గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు