కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర భేష్‌

28 Oct, 2021 05:03 IST|Sakshi
పోలీసుల కుటుంబాలకు చెక్కు అందజేస్తున్న హోం మంత్రి సుచరిత, డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ తదితరులు

హోం మంత్రి మేకతోటి సుచరిత

కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

రూ.3.72 కోట్లు సాయం చేసిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా  

సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్‌: కరోనా కట్టడికి పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని హోం మంత్రి మేకతోటి సుచరిత అభినందించారు. పోలీసుల సేవలకు ప్రభుత్వం తగిన విధంగా గుర్తింపునిస్తోందని చెప్పారు. పౌర సమాజం కూడా పోలీసుల కృషిని గుర్తించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కరోనా వల్ల మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.3.72 కోట్ల ఆర్థిక సాయాన్ని మ్యాన్‌కైండ్‌ ఫార్మా సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ చెక్కులను హోం మంత్రి సుచరిత బుధవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆమె గుంటూరు నుంచి పాల్గొన్నారు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున సాయం అందించామని చెప్పారు. మ్యాన్‌కైండ్‌ ఫార్మా సంస్థ కూడా ఉదారంగా స్పందించడం ప్రశంసనీయమన్నారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడం, వలస కూలీలకు సహాయం చేయడం, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం తదితర విధులను పోలీసులు నిబద్ధతతో నిర్వర్తించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఉద్యోగి హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందించామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని రీతిలో ఏపీ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో మ్యాన్‌కైండ్‌ ఫార్మా సీఈవో రాజీవ్‌ జునేజా, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు