నేటినుంచి తిరుపతిలో పోలీస్‌ డ్యూటీ మీట్

4 Jan, 2021 06:00 IST|Sakshi
ఆయుధాన్ని పరిశీలిస్తున్న డీజీపీ గౌతమ్‌సవాంగ్‌

వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

7వ తేదీ వరకు పోలీసు పరాక్రమ ప్రదర్శన 

సైబర్‌ సేఫ్టీ, ఉమెన్‌ సేఫ్టీ,కొత్త టెక్నాలజీపై సింపోజియంలు 

షెడ్యూల్‌ విడుదల చేసిన డీజీపీ సవాంగ్‌

సాక్షి, అమరావతి: శాంతిభద్రతల నిర్వహణలోనూ, సాంకేతికంగానూ జాతీయస్థాయిలో రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పరాక్రమ ప్రదర్శనకు వేళయింది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా తిరుపతిలో ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌ సోమవారం ప్రారంభం కానుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో డ్యూటీ మీట్‌ను ప్రారంభిస్తారు. తిరుపతి ఎమ్మార్‌పల్లి ఏఆర్‌ గ్రౌండ్‌లో డీజీపీ డి.గౌతమ్‌సవాంగ్‌ పర్యవేక్షణలో సోమవారం నుంచి ఈనెల ఏడో తేదీ వరకు జరిగే ఈ డ్యూటీ మీట్‌లో 13 జిల్లాల నుంచి 200 మంది పోలీస్‌ ప్రతినిధులు పాల్గొంటారు. సింపోజియంలు, పోలీస్‌ టెక్నాలజీ స్టాళ్ల నిర్వహణలో మరో వందమంది పోలీసులు పాల్గొంటారు.  

అధునాతన టెక్నాలజీకి సంబంధించిన ఒప్పందాలు  కుదుర్చుకోనున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్క్వాట్స్‌ బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌ ప్రదర్శనలిస్తాయి. రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పోలీస్‌ టెక్నాలజీ ఇండస్ట్రీస్‌కు చెందిన 35 కంపెనీలు ఇందులో భాగస్వామ్యమవుతున్నాయి. అవి రూపొందించిన అధునాతన సాంకేతిక పరికరాల స్టాళ్లతోపాటు పోలీస్‌ యూనిట్లు ఏర్పాటు చేసే మొత్తం 51 స్టాళ్లను పరిశీలించి అవగాహన పెంచుకునేలా ప్రజలకు అవకాశం కల్పించారు. రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్‌లో ఎంపికైన పోలీస్‌ ప్రతినిధులు జాతీయస్థాయి మీట్‌కు హాజరు కానున్నారు. ఆరోతేదీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొంటారు. రాష్ట్రస్థాయి డ్యూటీమీట్‌కు అనుబంధంగా నాలుగు రోజులపాటు ఇగ్నైట్‌ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల అజెండాను డీజీపీ డి.గౌతమ్‌సవాంగ్‌ ఆదివారం మీడియాకు విడుదల చేశారు.  

► సోమవారం తిరుపతి ఐఐటీ, ఐసెర్, శ్రీసిటీ ట్రిపుల్‌ ఐటీ, జెన్‌ టెక్‌ లిమిటెడ్‌ (హైదరాబాద్‌)తో పోలీసుశాఖ ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంటుంది. ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి పర్యవేక్షణలో సోషల్‌ మీడియా నిర్వాహకులతో ముఖాముఖి జరుగుతుంది. ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్‌పై దర్యాప్తు ఎలా చేయాలనే అంశంపై సీబీఐ ఎస్పీ విమలాదిత్య మాట్లాడతారు.  
► మంగళవారం ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ, స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో పోలీసుశాఖ ఒప్పందం కుదుర్చుకుంటుంది. రైల్వేస్‌ డీజీ ద్వారకా తిరుమలరావు పర్యవేక్షణలో ‘సైబర్‌ క్రైమ్‌లో కొత్త తరహా పోకడలు’ అనే అంశంపై నిపుణులు పాటిబండ్ల ప్రసాదరావు, ఎం.జగదీ‹Ùబాబు వివరిస్తారు. ఐజీ సంజయ్‌ పర్యవేక్షణలో ‘సైబర్‌ జాగ్రత్తలు’ అంశంపై సైబర్‌ నిపుణులు అనిల్, మనీష్‌యాదవ్, సాయిసతీష్‌ మాట్లాడతారు. సీఐడీ డీఐజీ సునీల్‌నాయక్‌ పర్యవేక్షణలో ‘ఆన్‌లైన్‌ రుణ మోసాలు’ అనే అంశంపై ఆర్బీఐ అధికారి ఏవైవీ కృష్ణ మాట్లాడతారు. 
► గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ పర్యవేక్షణలో యువ ఐపీఎస్‌ అధికారులు వకుల్, మల్లిక, మణికంఠ యువ పోలీసులతో ముఖాముఖీ, కెరీర్‌ పరంగా అవకాశాలు, క్విజ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.  బుధవారం ఉమెన్‌ సెఫ్టీ అంశంపై రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడతారు. ‘మహిళలపై నేరాలు’ అంశంపై విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షణలో జరిగే సెమినార్‌లో మానవ అక్రమరవాణా, మహిళల రక్షణ విశ్లేషకులు పి.నీరజ, దేవీసీతం, డీఐజీ పాలరాజు పర్యవేక్షణలో ‘మహిళలపై నేరాల నియంత్రణ’ అంశంపై దిశ ప్రత్యేక అధికారి దీపికపాటిల్‌ మాట్లాడతారు. ఐపీఎస్‌ అధికారులు కృష్ణకాంత్, మణికంఠ, ప్రేరణ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు నిర్వహిస్తారు. గురువారం నాటితో కార్యక్రమం ముగుస్తుంది.

కుమార్తెకు తండ్రి సెల్యూట్‌
తిరుపతి క్రైమ్‌: పోలీసు డిపార్ట్‌మెంట్‌లో తన పైఅధికారికి సెల్యూట్‌ చేయడం సాధారణ విషయం. కానీ ఆ ఉన్నతాధికారి తన గారాలపట్టి అయితే ఆ తండ్రి చేసే సెల్యూట్‌లో ఆనందంతోపాటు ప్రేమ గర్వం కలగలిసి ఉంటాయి. అటువంటి ఘటనే ఆదివారం తిరుపతిలోని ఏఆర్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో చోటుచేసుకుంది. 2018 బ్యాచ్‌కి చెంది న జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్‌ సౌత్‌ డీఎస్పీగా పనిచేస్తున్నారు. తిరుపతిలో సోమవారం ప్రారంభం కానున్న పోలీస్‌ డ్యూటీమీట్‌ ‘దిశ’ విభాగంలో బాధ్యతలు  నిర్వహిస్తున్నారు. తిరు పతి కళ్యాణి డ్యామ్‌ పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌లో  సీఐగా పనిచేస్తున్న ఆమె తండ్రి శ్యామ్‌సుందర్‌ నమస్తే మేడం అంటూ సెల్యూట్‌ చేశారు. తను కూడా సెల్యూట్‌ చేసి ఏంటి నాన్నా అంటూ గట్టిగా నవ్వేశారు.  

మరిన్ని వార్తలు