ఏపీలో మాస్క్‌ మస్ట్; కఠినంగా అమలు‌

31 Mar, 2021 04:48 IST|Sakshi

కరోనా కట్టడికి పోలీసుల కృషి

రోజూ రెండు గంటలపాటు రోడ్లపైనే యంత్రాంగం

మాస్క్‌ పెట్టని సీఐకి జరిమానా విధించిన గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి

కోవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామంటున్న డీజీపీ

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్‌ యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ఫలితాన్నిస్తోంది. ఎవరైనా మాస్క్‌ ధరించకుండా రోడ్డెక్కితే.. తొలుత అవగాహన కల్పించడం ఆపై జరిమానా విధించడం చేస్తుండటంతో ‘మాస్క్‌ మస్ట్‌’ అనే దిశగా ప్రజా చైతన్యం వెల్లివిరిస్తోంది. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా అన్ని జిల్లాల్లోనూ ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్లు, డీఐజీలు, ఐజీలు సైతం రోడ్డెక్కి ప్రజలను అప్రమత్తం చేస్తున్న తీరు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు రెండు గంటలపాటు మొత్తం పోలీస్‌ యంత్రాంగం రోడ్లపైనే ఉంటోంది.

మాస్క్‌ ధరించకుండా ప్రయాణించే వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించడం, జరిమానాలు విధించడం వంటి కార్యక్రమాల్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. మాస్క్‌ ధరించే విషయంలో పోలీసులు సైతం మినహాయింపు లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ సీఐకి సైతం జరిమానా విధించారు. గుంటూరు లాడ్జి కూడలిలో స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్క్‌ ధరించకుండా వెళ్తుండటంతో ఆపి మాస్కు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. హడావుడిలో మర్చిపోయానని బదులిచ్చిన సీఐ మల్లికార్జునరావుకు జరిమానా విధించిన ఎస్పీ అమ్మిరెడ్డి ఆయనకు స్వయంగా మాస్క్‌ తొడిగారు. 

కోవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
కోవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. ఇందుకోసం యంత్రాంగం మొత్తం మూడు రోజులుగా రోడ్లపైనే ఉంటూ కోవిడ్‌ నిబంధనల అమలుకు కృషి చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు. వేడుకలు, విందులు, వినోదాలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవాలి. వీలైతే వాటిని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మరీ మంచిది. బయటకి వస్తే తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, శానిటైజ్‌  చేసుకోవడం, భౌతిక దూరం పాటించటం వంటి వాటిని అలవాటుగా మార్చుకోవాలి. దుకాణదారులు సైతం వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలి. 
– గౌతమ్‌ సవాంగ్, డీజీపీ  

>
మరిన్ని వార్తలు