డాక్ట‘రేట్‌’! 

2 Oct, 2020 09:33 IST|Sakshi

రూ.పది వేలు ఇస్తే చాలు ప్రదానం!

నకిలీ యూనివర్సిటీల మాయాజాలం

జిల్లాలో వంద మంది వరకూ పొందిన వైనం 

వారిపై కర్ణాటక పోలీసుల ఆరా 

వివిధ విభాగాల్లో ప్రముఖులు, పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గౌరవ డాక్టరేట్‌ అందిస్తారు. అలాంటి ఉన్నత పురస్కారానికి కొందరు మకిలీ అంటిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి అంగట్లో సరుకులా అమ్మేస్తున్నారు. విశిష్ట పట్టాకు విలువ లేకుండా చేస్తున్నారు. నకిలీ యూనివర్సిటీలను సృష్టించి దందా సాగిస్తున్నారు. కేవలం రూ.పదివేలు ఇస్తే చాలు అర్హత లేకున్నా డాక్టరేట్‌ డిగ్రీ ప్రదానం చేసేస్తున్నారు. ఏజెంట్లు, సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ఫేక్‌ డాక్టరేట్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి నకిలీ బిరుదాంకితులు వందమంది వరకు ఉండవచ్చని సమాచారం.

పలమనేరు: జిల్లాలో నకిలీ డాక్ట‘రేట్ల’ బాగోతం కలకలం రేపుతోంది. సుమారు వంద మంది వరకు కొన్ని ఫేక్‌ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరెవరు పొందారు.. ఎక్కడి నుంచి పొందారు..? అనే దానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం.  

వెలుగులోకి ఇలా.. 
మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ఇంటర్నేషనల్‌ పీస్‌ యూనివర్సిటీ తాజాగా కర్ణాటకలోని మైసూరులో వంద మందికి గౌరవ డాక్టరేట్ల ప్రదాన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. డబ్బులు తీసుకుని డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో అక్కడి డీసీపీ ప్రకాగౌడ అవాక్కయ్యారు. వెంటనే తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకుని కొందరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. డాక్టరేట్ల డొంక కదిలించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్టు తెలిసింది. చిత్తూరు జిల్లాకు చెందిన వంద మంది వరకూ ఇప్పటికే ఫేక్‌ డాక్టరేట్లను పొందినట్టు నిర్ధారణయ్యింది. తాజాగా మరో 50 మంది డాక్టరేట్లకు డబ్బులు చెల్లించినట్టు సమాచారం. 

పదుల సంఖ్యలో నకిలీ యూనివర్సిటీలు 
పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలు ఫేక్‌ యూనివర్సిటీలు డబ్బులకు డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నాయి. కోయంబత్తూరు, చెన్నై, బెంగళూరు, మైసూ రు, పాండిచ్చేరి కేంద్రాలుగా యూనివర్సల్‌ పీస్‌ యూనివర్సిటీ (అమెరికా), మలేషియా లింకోక్వింగ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ గ్లోబల్‌ ఆక్స్‌ఫర్డ్‌ తదితర యూనివర్సిటీలు ఐదేళ్లుగా నకిలీ డాక్టరేట్ల ప్రదానంతో లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. కొందరు ఏజెంట్లు పట్టణాల్లోని వీఐపీలకు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. 

జిల్లాలో ఎవరెవరో? 
డాక్టరేట్ల కోసం ఇప్పటికే రూ.10 వేల నుంచి రూ.50 వేల దాకా డబ్బులు చెల్లించిన వీఐపీలు జిల్లాలో వంద మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో రాజకీయ నాయకులు, రిటైర్ట్‌ అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సంఘ సేవకులు, రియల్టర్లు, బిల్టర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, శాస్త్రవేత్తలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటిదాకా డాక్టరేట్లు పొందిన వారి జాబితా మైసూరు పోలీసుల చేతికి చిక్కినట్టు తెలిసింది. వీరిలో చాలామంది ఇప్పటికే ‘గౌరవ డాక్టర్లు’గా సమాజంలో గుర్తింపు పొందుతుండడం గమనార్హం!. పోలీసులు కేసు నమోదు చేసి నకిలీ వర్సిటీల బాగోతం తేల్చే పనిలో పడ్డారు.  

మరిన్ని వార్తలు