విశాఖపై పోలీస్‌ ఫోకస్‌ 

2 Aug, 2020 04:58 IST|Sakshi

పరిపాలన రాజధాని చేయడంతో మరింత భద్రతా చర్యలు 

విశాఖ పోలీస్‌ కమిషనర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన రాజధాని విశాఖపట్నంపై పోలీస్‌ ఫోకస్‌ మొదలైంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్రవేయడంతో పరిపాలన రాజధాని విశాఖపట్నంలో అవసరమైన పోలీస్‌ వనరుల పెంపుపై అధ్యయనానికి పోలీసు విభాగం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమిస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ వివరాలు ఏమిటంటే.. 

► పరిపాలన రాజధాని విశాఖపట్నంలో పోలీస్‌ శాఖ ఎటువంటి కార్యాచరణ (ప్లానింగ్‌) చేపట్టాలనే దానిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటైంది.   
► దీనికి విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) చైర్మన్‌గాను, పోలీస్‌ ప్రధాన కార్యాలయం(మంగళగిరి) ప్లానింగ్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్యూటీ (ఓఎస్‌డీ) కన్వీనర్‌గా ఉంటారు.  
► అలాగే, పోలీస్‌ ప్రధాన కార్యాలయం (మంగళగిరి) పోలీస్‌ ట్రైనింగ్‌ ఐజీ, పర్సనల్‌ ఐజీ, పీ అండ్‌ ఎల్‌ ఐజీ, ఏపీ ఇంటెలిజెన్స్‌–ఎస్‌ఐబీ (విజయవాడ) ఐజీ, పోలీస్‌ ప్రధాన కార్యాలయం(మంగళగిరి) టెక్నికల్‌ సర్వీస్‌ డీఐజీ, విశాఖపట్నం రేంజ్‌ డీఐజీలు కమిటీలో సభ్యులుగా ఉంటారు.  

కరోనా వారియర్స్‌ను రక్షించుకుందాం..
కోవిడ్‌–19 వైరస్‌ కట్టడిలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా నిలుస్తోన్న పోలీసులను రక్షించుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. మహమ్మారి నివారణకు పోలీసులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎటువంటి వైద్యం తీసుకోవాలి, ముందస్తు చర్యలపై ఏపీ పోలీస్, అపోలో ఆసుపత్రి సంయుక్తంగా శనివారం వెబినార్‌ ద్వారా ప్రత్యేక వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్లాస్మా థెరపీని ప్రోత్సహించడం గొప్ప పరిణామమన్నారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా ‘కోవిడ్‌ కాప్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 18005323100’ను డీజీపీ సవాంగ్‌ ఆవిష్కరించారు. కోవిడ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్‌ను విడుదల చేశారు.

మరిన్ని వార్తలు