తాబేళ్ల అక్రమ రవాణా గుట్టు రట్టు!

28 Feb, 2022 04:19 IST|Sakshi
వదర్లపాడు గ్రామంలో పోలీసుల అదుపులో నిందితులు, తాబేళ్ల మూటలు

కైకలూరు: కృష్ణాజిల్లా కొల్లేరు పరిసర ప్రాంతాల నుంచి తాబేళ్లను రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వదర్లపాడు గ్రామం వద్ద రూరల్‌ ఎస్‌ఐ చల్లా కృష్ణా శనివారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో ఆటో, మినీ వ్యాన్‌ల్లో 25 బస్తాల్లో నాలుగు టన్నుల తాబేళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన పంతగాని నాగభూషణం (48), గరికిముక్కు సందీప్‌ (30), అదే మండలం కొండూరుకు చెందిన దేవదాసు ఏసుబాబు (27) తాబేళ్లను రవాణా చేస్తుండగా వాహనాలతో సహా అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు ఆదివారం అప్పగించారు.

ఇక్కడ కేజీ తాబేలు రూ.15 చొప్పున కొని ఇతర రాష్ట్రాల్లో రూ.50 నుంచి రూ.100కి విక్రయిస్తున్నారు. తాబేళ్ల మాంసానికి గిరాకీ ఉండటంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. వైల్డ్‌ లైఫ్‌ ఏలూరు ఫారెస్టు రేంజ్‌ ఆఫీసరు కుమార్‌ ఆధ్వర్యంలో డెప్యూటీ రేంజ్‌ ఆఫీసరు జయప్రకాష్, బీటు ఆఫీసరు రాజేష్‌ నిందితులపై అటవీపర్యావరణ చట్టం 1972 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేసి కైకలూరు కోర్టుకు తరలించారు. మేజిస్ట్రేటు ఆదేశాలతో పట్టుబడిన తాబేళ్లను కొల్లేరు సరస్సులో విడిచిపెడతామని అధికారులు చెప్పారు.  

మరిన్ని వార్తలు