అజ్ఞాత వాసం.. టీడీపీ, జనసేన నేతల గుండెల్లో గుబులు 

29 May, 2022 21:23 IST|Sakshi
అమలాపురంలో పోలీసుల కవాతు

సొంత ఫోన్లు వినియోగించకుండా జాగ్రత్తలు

ఆధునిక టెక్నాలజీతో పోలీసుల అడుగులు

నిఘా నీడలో కొనసాగుతున్న కోనసీమ

అమలాపురం టౌన్‌(కోనసీమ జిల్లా): కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో ఈ నెల 24న విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోపక్క పోలీసులు ఆధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో సీసీ కెమెరా ఫుటేజ్‌లు, కాల్‌ డేటాలతో ఆందోళనకారులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే 19 మందిని అరెస్ట్‌ చేశారు. 46 మందిపై కేసులు నమోదు చేశారు. మరో 23 మందిని అదుపులోకి తీసుకుని, కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. పోలీసులు దాదాపు 150 మందిని అనుమానితులుగా గుర్తించడంతో ఆందోళనకారుల్లో వణుకు పుడుతోంది.
చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు

పోలీసుల కంట పడకుండా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. కొందరు సొంత ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసేస్తే.. మరికొందరు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నా లిఫ్ట్‌ చేయకుండా మిన్నకుండిపోతున్నారు. మరికొందరు హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకున్నట్లు తెలిసింది. విధ్వంస కాండకు పాల్పడిన వారిలో అధిక శాతం టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన క్రియాశీలక కార్యకర్తలే ఉన్నారు. కేసులు నమోదైన ముగ్గురు బీజేపీ నాయకులు, ఇద్దరు టీడీపీ, ఆరుగురు జనసేన కార్యకర్తలు అజ్జాతంలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆందోళనకారుల ఫోన్‌ నంబర్ల కాల్‌ డేటా, ఫోన్లు ఏ టవర్‌ పరిధిలో ఉన్నాయో పోలీసులు ఆధునిక టెక్నాలజీతో పసిగడుతున్నారు.

ఆ రెండు పార్టీ నేతల్లో గుబులు 
విధ్వంసకర ఘటనల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఉన్నారు. దీంతో ఆయా పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోలీసు విచారణలో తమ పేర్లు ఎక్కడ బయట పడతాయోనని పలువురు గుబులు చెందుతున్నారు. తమ ఫోన్లు ట్రాప్‌ చేస్తున్నారేమోనన్న అనుమానంతో ఆ పార్టీల నేతలు సొంత ఫోన్లకు బదులు కొత్త ఫోన్లు, నంబర్ల నుంచి మాట్లాడుతున్నారు.

ఇంకా నిఘా నీడలోనే..
విధ్వసంకర ఘటనలతో అట్టుడికిన అమలాపురం పూర్తిగా కుదుటపడింది. జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా మాత్రం కొనసాగుతోంది. దాదాపు వెయ్యి మంది పోలీసులు ముఖ్య కూడళ్ల వద్ద పహారా కాస్తున్నారు. రోడ్లపై వాహనాల విస్తృత తనిఖీలకు పోలీసులు శనివారం నుంచి తెర వేశారు. ఆందోళనకారులను దీటుగా కట్టడి చేసేందుకు తగిన బందోబస్తుతో పోలీసు శాఖ సంసిద్ధమై ఉంది. 

మరిన్ని వార్తలు