బాబోయ్‌ ఆ డ్యూటీలా.. వద్దే వద్దు 

24 Sep, 2020 11:39 IST|Sakshi

లా అండ్‌ ఆర్డర్‌ డ్యూటీలపై పోలీస్‌ అధికారుల అనాసక్తి 

నగరంలో తీరిక లేని విధులతో పోలీసు సిబ్బంది సతమతం 

ఒత్తిడికి గురవుతున్న కొందరు అధికారులు

బదిలీల కోసం అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్న సీఐలు, ఎస్‌ఐలు   

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ పోలీసు కమిషరేట్‌లో పోస్టు అంటే ఏ పోలీసు అధికారి అయినా ఎగిరి గంతేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. లా అండ్‌ ఆర్డర్‌ విభాగంలో పనిచేయలేమని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే లూప్‌లైన్‌లో పనిచేయడానికైనా సిద్ధమంటున్నట్లు తెలుస్తోంది. తీరిక లేని విధులే ఇందుకు కారణమని సమాచారం. 

ప్రస్తుత పని విధానం.. 
ప్రతిరోజు డ్యూటీలో చేరిన వెంటనే టెలీ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలి. తరువాత స్టేషన్‌ పరిధిలో అప్పటి వరకు ఉన్న కేసులు పరిశీలించడంతో పాటు వీఐపీల రాక వంటి బాధ్యతలు చూసుకోవాలి. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్, మళ్లీ రాత్రికి వాహనాల తనిఖీ, వీటితో పాటు నిత్యం స్టేషన్లకు వచ్చే కేసుల దర్యాప్తు ఉండనే ఉంటుంది. వీటితో వీక్లీ ఆఫ్‌లు సరిగా వినియోగించుకోలేని పరిస్థితి. కొత్తగా స్టేషన్లలో విధుల్లో ఉన్న యువ ఎస్‌ఐలూ మా వల్ల కాదంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కమిషనరేట్‌ పరిధిలో లా అండ్‌ ఆర్డర్‌ విభాగం పరిధిలోని స్టేషన్లలో కొందరు ఉన్నతాధికారులు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. వీరంతా కొంత కాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం.  

ఎందుకీ పరిస్థితి..  
నగర కమిషనరేట్‌ పరిధిలో చిన్నచిన్న ఘటనలపైనా మినిట్‌ టూ మినిట్‌ వాకబు ఉంటోంది. అధికారులు ఫోన్లలోనే పరిస్థితిని సమీక్షిస్తారు. చిన్న పొరపాట్లకు చార్జీ మెమోలు జారీ. దీంతో మానసిక వేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. పోలీసు బాస్‌లు మారిన ప్రతిసారి ఆయా పోలీసు అధికారుల తీరు నచ్చకపోతే వారి స్థానంలో కొత్త వారు రావడం సహజంగా జరిగే పనే. అయితే ప్రస్తుతం పనితీరు బాగున్నా కొందరు అధికారులను తప్పించేందుకు కొందరు పావులు కదుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ నగరంలో కీలకమైన ఓ జోన్‌ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు ఇటీవల తాను శాంతిభద్రతల విభాగంలో పనిచేయలేనని ఓ ఉన్నతాధికారికి తేల్చిచెప్పగా.. మరో అధికారి ఆ జోన్‌లో ఫోకస్‌ పోస్ట్‌ వద్దు బాబోయ్‌.. లూప్‌లైన్‌లో పనిచేస్తానని ఉన్నతాధికారి వద్ద మొర పెట్టుకున్నట్లు తెలిసింది. ఇలా నగర కమిషనరేట్‌ పరిధిలో పలువురు అధికారులు లూప్‌లైన్‌లో పనిచేయడానికి ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్, ఎస్‌బీ విభాగాలకు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నట్లు తెలిసింది.  

పోలీసులపై ఒత్తిడి లేదు.. 
నగర కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదు. అందరూ సమన్వయంతో పనిచేయాలంటున్నాం. విజిబుల్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. ప్రస్తుతం పోలీసులు సమర్ధవంతంగా పనిచేయడం వలనే పెండింగ్‌లో ఉన్న 10 వేల కేసులను నాలుగు వేలకు తీసుకురాగలిగాం. పోలీసుల పనితీరు వల్లే ఇది సాధ్యమైంది. పనితీరు బాగాలేకపోతే వారి స్థానంలో కొత్త వారు వస్తారు.  –బత్తిన శ్రీనివాసులు, నగర పోలీసు కమిషనర్, విజయవాడ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా