ప్రాణం నిలిపిన ఖాకీలు

3 Jun, 2021 08:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చనిపోతున్నానంటూ మెసేజ్‌ పంపిన యువకుడు

పోలీసులకు సమాచారమిచ్చిన కుటుంబీకులు 

తీవ్ర గాలింపుతో గంటలోపే దొరికిన ఆచూకీ 

కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపిన పోలీసులు 

ఉరవకొండ: ముగ్గురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు.. ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సమయస్ఫూర్తితో కదిలారు. గంటపాటు ఉరుకులు పరుగులు తీశారు. ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడి ఆచూకీ కనిపెట్టి రక్షించారు. ఓ కుటుంబానికి మేలు చేశారు. వివరాల్లోకి వెళితే.. విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన పృథ్వీరాజ్‌ బుధవారం కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. అనంతరం తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా మెసెజ్‌ పంపి సెల్‌ స్వీచ్‌ ఆఫ్‌ చేశాడు. దీంతో ఆందోళన చెందిన యువకుడి తండ్రి వేణుగోపాల్‌ పాల్తూరు ఎస్‌ఐ రాజేశ్వరికి ఫిర్యాదు చేశాడు.

వెంటనే ఆమె ఈ విషయాన్ని సీఐ శేఖర్‌ దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన సీఐ వెంటనే పాల్తూరు, ఉరవకొండ, వజ్రకరూరు ఎస్‌ఐలను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ముగ్గురు ఎస్‌ఐలు తీవ్రంగా గాలించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వజ్రకరూరు మండలం చిన్నహోతూరు సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద యువకుడి ఆచూకీ కనిపెట్టారు. అప్పటికే కాలువలో దూకేందుకు సిద్ధంగా ఉన్న యువకుడిని నిలువరించిన ఎస్‌ఐలు.. అతన్ని సీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. దీంతో సీఐ శేఖర్‌ యువకుడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత యువకుడికీ నచ్చజెప్పి ఇంటికి పంపారు. ఫిర్యాదు అందిన గంటలోపే యవకుడిని కాపాడిన సీఐ, ముగ్గురు ఎస్‌ఐలను ఎస్పీ సత్యయేసుబాబు ఫోన్‌లో అభినందించారు.

చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన
ఎంతటి విషాదం: నవ దంపతులు కరోనాను జయించారు.. కానీ

మరిన్ని వార్తలు