రెండు సెకన్లలోనే పోలీసులు స్పందించారు

11 Apr, 2021 04:38 IST|Sakshi
ఆదిలక్ష్మికి ఆర్థిక సాయం అందజేస్తున్న కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప

బొమ్మలసత్రం (నంద్యాల): ‘ఆత్మస్థైర్యం కోల్పోయి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ చివరి క్షణంలో పిల్లలను బతికించుకోవాలన్న ఆశ కలిగింది. దీంతో దిశ యాప్‌ ద్వారా పోలీసులకు కాల్‌ చేశా. కేవలం రెండు సెకన్లలోనే వారు స్పందించారు. మా సమస్య విన్న కొద్దిసేపటికే ఘటన స్థలానికి చేరుకుని నాతోపాటు నా పిల్లలను రక్షించారు’ అని ఆదిలక్ష్మి అనే బాధితురాలు తెలిపింది. వివరాల్లోకెళ్తే.. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవులకు చెందిన ఎ.ఆదిలక్ష్మి, తన కుమార్తెలు సుప్రియ (7), చరిత (5)తో కలిసి శుక్రవారం నంద్యాల–గిద్దలూరు ఘాట్‌ రోడ్డులో సర్వనరసింహస్వామి ఆలయం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దిశ యాప్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి వారిని కాపాడారు.

శనివారం నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలితోపాటు ఆమె పిల్లలను జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పరామర్శించారు. డీఎస్పీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో బాధితురాలికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కీరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలక్ష్మి భర్త ప్రసాద్‌ గతేడాది ప్రమాదవశాత్తూ కుందూ నదిలో పడి మృతి చెందాడన్నారు. ఆమె తన ముగ్గురు కుమార్తెలు సుప్రియ, చరిత, యామినిలతో కలిసి గ్రామంలోనే నివసిస్తోందని, భర్త లేకపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే సూపర్‌ వాస్మోల్‌ ద్రావణాన్ని తాను సేవించి.. పెద్ద కుమార్తె సుప్రియ, రెండో కుమార్తె చరితకు కూడా తాగించిందన్నారు. కొంత సమయం తర్వాత కుమార్తెలను ఎలాగైనా బతికించుకోవాలన్న తపనతో తన సెల్‌ఫోన్‌లోని దిశ యాప్‌ ద్వారా తమకు కాల్‌ చేసిందన్నారు. దిశ యాప్‌ వల్లే బాధితురాలిని, ఆమె కుమార్తెలను రక్షించగలిగామని చెప్పారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా యాప్‌ ద్వారా పోలీసులను సంప్రదించాలన్నారు. బాధితురాలిని కాపాడటంలో చొరవ చూపిన మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు.   

మరిన్ని వార్తలు