మొబైల్‌ సిగ్నల్‌ ట్రాకింగ్‌తో.. నిండు ప్రాణాన్ని నిలబెట్టారు! 

20 Jul, 2021 07:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆత్మహత్యకు పూనుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు  

రైలొచ్చే కొన్ని క్షణాల ముందు రక్షించిన వైనం  

ఒంగోలు: రైలు పట్టాలపై యువకుడు పడుకుని ఉన్నాడు.. దూరంగా రైలు కూత వినిపిస్తోంది.. రైలు మరింత దగ్గరికొచ్చినట్టుగా శబ్దం వినిపిస్తోంది.. యువకుడు మాత్రం అలానే పడుకుని ఉన్నాడు. మరికొద్ది క్షణాలు ఆలస్యమైతే యువకుడి తల తెగిపడేదే. కానీ అంతలోనే అద్భుతం జరిగింది. పోలీసులు వచ్చి యువకుడిని పక్కకు లాగేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనతో అక్కడి పోలీసులు శభాష్‌ అనిపించుకున్నారు. జె.పంగులూరు మండలం తూర్పుకొప్పెరపాడుకు చెందిన కలవ కిషోర్‌కు రెండేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగింది. కృత్రిమ కాలుతో జీవనం సాగిస్తున్నాడు. కాలు విరిగినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయి బంధువులకు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. బంధువుల ద్వారా ఆ సమాచారం అందుకున్న జె.పంగులూరు ఎస్‌ఐ శ్రీనివాసరావు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మలికా గర్గ్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ.. ఐటీ కోర్‌ విభాగాన్ని అప్రమత్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కిషోర్‌ మొబైల్‌ లొకేషన్‌ను గుర్తించారు. వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి వద్ద రైల్వే ట్రాక్‌పై కిషోర్‌ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. వెంటనే వేటపాలెం ఎస్‌ఐ కమలాకర్‌కు ఎస్పీ ఆదేశాలిచ్చారు.

ఆ మేరకు సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ.. రైల్వే ట్రాక్‌పై ఉన్న కిషోర్‌ను పక్కకు లాగేశారు. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే ఆ ట్రాక్‌ మీదుగా రైలు వెళ్లింది. పోలీసులు వెళ్లడం ఆ రెండు నిమిషాలు ఆలస్యమై ఉంటే కిషోర్‌ ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీస్‌ సిబ్బందిని నగదు రివార్డులతో ఎస్పీ సత్కరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు