కేశినేని కుటుంబంలో కుంపటి!

28 May, 2022 08:55 IST|Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగినట్లు టీడీపీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. చంద్రబాబునాయుడు, లోకేష్‌లు నాని ప్లేస్‌లో తన సోదరుడైన కేశినేని శివనాథ్‌ (చిన్ని)ని చేరదీసినట్లు తెలుస్తోంది.  

అన్నదానం పేరిట..  
ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల పేరిట విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) శనివారం నగరంలోని ఆటోనగర్‌ జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కేశినేని డెవలపర్స్‌ పేరిట నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయం వద్ద, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన హోర్డింగులు, పోస్టర్లలో టీడీపీ వ్యవస్థాపకుడైన∙ఎన్టీ రామారావు, ఆపార్టీ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులైన చంద్రబాబునాయుడు, లోకేష్‌లతో పాటు కేశినేని చిన్ని ఫొటోలు మాత్రమే ఉండటం చర్చనీయాంశంగా మారాయి.  

పొమ్మనకుండా పొగపెడుతున్నారా? 
విజయవాడ ఎంపీ కేశినేనికి రాజకీయంగా చెక్‌ పెట్టడానికి అధిష్టానం పావులు కదుపుతోందా అనే అనుమానాలు నాని అనుచరుల నుంచి వ్యక్తమవుతున్నాయి. తన ఎన్నికలప్పుడు, కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో నానికి, నగరంలోని సీనియర్‌ నాయకుల మధ్య జరిగిన బహిరంగ మాటల యుద్ధం తెలిసిందే. కొన్ని నెలల కిందట చంద్రబాబు, ఇతర నాయకులు ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడి అవసరాలకు నానీని దగ్గరకు తీసుకున్నట్లు, సన్నిహితంగా ఉన్నట్లు అధినేత కనిపించారు. ఆ తర్వాత జిల్లా పార్టీలో చోటుచేసుకున్న పలు పరిణామాల సమయంలో కేశినేనితో చంద్రబాబు  అంటీముట్టనట్లు ఉంటున్నారు. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్‌ మీరా, తంగిరాల సౌమ్య, పట్టాభి తదితరులకు ఎంపీతో పొసగకపోవడం, వారికి అధిష్టానం పరోక్ష మద్దతిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నానికి పొమ్మనకుండా పొగపెడుతున్నట్లు ఉందని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

చిన్నితో నానికి చెక్‌! 
నాని, చిన్నిలు అన్నదమ్ములే అయినప్పటికీ ఎవరి వ్యాపార వ్యవహారాలు వారివే. 2014 ఎన్నికల సమయంలో నానీకి చేదోడు వాదోడుగా ఉన్నట్లు కనిపించిన చిన్ని 2019 ఎన్నికలప్పుడు కనిపించలేదు. కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో మాత్రం ఓ పర్యాయం ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలిసిన చంద్రబాబు, లోకేష్‌లు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో స్థిరపడిన చిన్నితో గత కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో మంతనాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. చిన్ని రానున్న ఎన్నికల బరిలో దిగనున్నారనే ఫీలర్లు బాబు, లోకేష్‌లే         పంపుతూ నానీకి చెక్‌ పెడుతున్నారని అంటున్నారు. 

మరిన్ని వార్తలు