గెలుపుపై నమ్మకం కోల్పోయిన టీడీపీ ప్రముఖులు

19 Sep, 2022 13:40 IST|Sakshi

సాక్షిప్రతినిధి కర్నూలు : గెలుపు, ఓటమి సమస్య కాదు.. గత 20 ఏళ్లుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. ఇది మాకు తెలుసు. అయితే నియోజకవర్గస్థానం ముఖ్యం. ఒక్కసారి టిక్కెట్‌ వదులుకుని నియోజకవర్గాన్ని పోగొట్టుకుంటే తిరిగి అందుకోవడం చాలా కష్టం.  అందుకే గెలిచినా, ఓడినా పోటీ చేయడం ముఖ్యం. 
– ఇటీవల టీడీపీ నేతలు బాహాటంగానే చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. 

ఈ మాటలు చూస్తే తెలుగుదేశం పార్టీ నేతల్లో గెలుపుపై పెద్దగా ఆశల్లేవనే విషయం సుస్పష్టమవుతోంది. కేవలం రాజకీయ ఉనికి కోసం పోటీ చేయాలని తాపత్రయ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంత శ్రమించినా అధికార పార్టీని ఢీకొట్టడం అంత సులభం కాదనే ధోరణిలో ఉన్నారు. అయితే నియోజకవర్గ స్థానాలను కాపాడుకోవడంలో ఎవరికివారు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో వర్గవిభేదాలు బట్టబయలవుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాలతో పాటు కర్నూలు పార్లమెంట్‌ స్థానంలో కూడా వర్గవిభేదాలతో టీడీపీ సతమతమవుతోంది.  

నంద్యాలలో నాలుగు ముక్కలాట
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో ఆళ్లగడ్డలో పరిస్థితి బాగోలేదని, మూడు నెలల్లో మార్పు రావాలని, లేదంటే పార్టీ ప్రత్యామ్నాయం చూసుకుంటుందని లోకేశ్‌ చెప్పినట్లు తెలిసిందే. ఈ క్రమంలో అఖిల ఆదివారం నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని నంద్యాల, గోస్పాడు కార్యకర్తలకు వారం రోజుల నుంచే ఆమె వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి ఆహా్వనించారు. విషయం తెలిసి అఖిలతో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడారు. 

ఇన్‌చార్జ్‌గా భూమా బ్రహ్మనందరెడ్డి ఉన్నప్పుడు పార్టీ కార్యాలయం ప్రారంభించడం సరికాదని చెప్పారు. ఆమె ససేమిరా అనడంతో అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో  అఖిలతో నేరుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎవ్వరినీ ఖాతరు చేయకుండా అఖిల ఆఫీసు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అఖిల సోదరుడు భూమా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్‌తో పాటు వీరి అనుచరులు దూరంగా ఉన్నారు. కార్యక్రమానికి ఎవ్వరూ వెళ్లకుండా భూమా బ్రహ్మానందరెడ్డి కట్టడి చేశారు. ఫరూక్‌ కూడా తన వర్గాన్ని వెళ్లకుండా నివారించారు. ఇప్పటికే నంద్యాలలో భూమా బ్రహ్మనందరెడ్డి, ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయి ఉన్నారు. 

ఈ క్రమంలో అఖిల రాకతో టీడీపీలో నాలుగో కుంపటి రగిలినట్లయింది. అయితే అఖిల మాత్రం.. నంద్యాలలో తన తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని, తాను ఆళ్లగడ్డ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. భవిష్యత్‌లో నంద్యాల మునిసిపల్‌ చైర్మన్‌గా విఖ్యాత్‌ను పోటీ చేయించి, 2029 ఎన్నికల్లో విఖ్యాత్‌కు ఎమ్మెల్యే టిక్కెట్‌ అడుగుతామని అఖిల వివరిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని, ఆళ్లగడ్డలో పరిస్థితి బాగోలేకపోవడంతో నంద్యాల టిక్కెట్‌ అఖిల ఆశిస్తున్నారని భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూక్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి దసరా నుంచి పూర్తిగా ఆళ్లగడ్డ రాజకీయాలపై దృష్టి పెడతానని తన వర్గీయులతో వ్యాఖ్యానిస్తున్నారు.  

ఆదోని టిక్కెట్‌ ‘మీనాక్షి’కి లేనట్టే! 
వయోభారంతో తాను పోటీచేయలేనని తన కుమారుడు భూపాల్‌చౌదరికి ఆదోని టిక్కెట్‌ ఇవ్వాలని లోకేశ్‌కు మీనాక్షినాయుడు విన్నవించారు. అయితే ఆదోని టిక్కెట్‌ ఈ దఫా బీసీలకు ఇచ్చే యోచనలో ఉన్నామని లోకేశ్‌ తేల్చిచెప్పారు. ఆదోనిలో ‘కమ్మ’ సామాజికవర్గానికి టిక్కెట్‌ ఇస్తే ఫలితం ఉండబోదని, అక్కడ బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఆదోని నుంచి టీడీపీ నేతలు దేవేంద్రప్ప, సూరం భాస్కర్‌రెడ్డి, గుడిసె కృష్ణమ్మతో పాటు మైనారీ్టనేత రవూఫ్‌ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. 

మనుగడ కోసం ‘కోట్ల’ యత్నం 
కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి 2014 వరకూ కర్నూలు రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు అతని రాజకీయ ప్రయాణం దారితెన్నూ లేనివిధంగా తయారైంది. 2014, 2019లో ఎంపీగా ఓడిపోవడంతో రాజకీయ మనుగడపై నమ్మకం సన్నగిల్లింది. కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో అధిక స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుస్తారని, తాను పోటీ చేసినా ‘హ్యాట్రిక్‌ ఓటమి’ తప్పదు అనే భావనకు వచ్చారు. అందుకే ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్‌ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా ఈ నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. 

దీంతో ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయి టీడీపీ మరింత బలహీనమైంది. ఎమ్మిగనూరులో కార్యాలయం ప్రారం¿ోత్సవం నుంచి కోట్ల చేస్తున్న రాజకీయాలపై లోకేశ్‌కు జయనాగేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధిష్టానంతో మాట్లాడిన కోట్లకు పార్టీ కొత్త విషయం చెప్పింది. కుటుంబానికి ఒక్క టిక్కెట్‌ మాత్రమే ఇస్తామని, మీ ఇంట్లో ఎవరు పోటీ చేస్తారో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తే మంత్రాలయం టిక్కెట్‌ ఇస్తామని, ఆలూరు బోయలకు ఇస్తామని, సుజాతమ్మ ఆలూరు నుంచి పోటీ చేస్తే మంత్రాలయం బోయలకు ఇస్తామని వారు స్పష్టం చేశారు. దీంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ‘కోట్ల’ కుటుంబం ఉంది.

ఇటీవల గోనెగండ్లలో విలేకరుల సమావేశంలో కూడా ‘కర్నూలు ఎంపీగా తానుకానీ లేదా మరొకరు కానీ పోటీ చేస్తారని’ కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి చెప్పారు. తాను ఎంపీ అభ్యరి్థగా రాలేదని, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వచ్చానన్నారు. ఎంపీ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని ధైర్యంగా చెప్పలేకపోయారు. అంటే తన స్థానంపై తనకే నమ్మకం, స్పష్టత లేదనే విషయం సుస్పష్టమవుతోంది. మరోవైపు జయనాగేశ్వరరెడ్డిపై కూడా టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరు నుంచి ఈ దఫా కొత్త ముఖాన్ని బరిలోకి దింపే యోచనలో టీడీపీ ఉందని లోకేశ్‌ను కలిసిన కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. దీంతో జయనాగేశ్వరరెడ్డికి కూడా టిక్కెట్‌ దక్కే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.   

మరిన్ని వార్తలు